‘‘ప్రతి పర్వతం, ప్రతి అడవి, ప్రతి నది, ప్రతి భూమిని పటాలుగా కుదించి నేలను పైళ్ల నంబర్లుగా మార్చేశారు. ఇప్పుడు మన కలల్ని ఎవరి ఒడిలో దాచిపెట్టాలి?/ మనం చెట్లనుంచి నిలబడటం నేర్చుకున్నాము, నదుల నుంచి ప్రవహించడం నేర్చుకున్నాము, భూమితో పెనవేసుకుపోయి మనుషులుగా బతకటమేలాగో నేర్చుకున్నాము. మన భూమి ఇకపై మనది కానప్పుడు ఏమైపోవాలి?’’అని ఆవేదనతో ప్రశ్నిస్తాడు ఆదివాసి కవి మనోజ్ ముర్ము (తెలుగు: విద్యాసాగర్). ఎంత వాస్తవిక చిత్రణ. గుండెల్లోంచి వచ్చిన భావ పరంపర అది. వాళ్లగురించి ఎవరం రాస్తున్నాము, ఎవరం వాళ్ల జీవితాలను చూస్తున్నాం! ఈ భూమిపైన, మట్టితో, చెట్టు పుట్టతో, కొండకోనతో, పక్షి పురుగుతో, సమస్త ప్రకృతితో మమేకమై, ప్రకృతిలో భాగంగా బతుకుతున్న మానవ సమూ హమే ఆదివాసీలు. ఈ నేల మూలవాసులు. ఇప్పటికీ వాళ్లఅడుగులు అడవిలోనే, పచ్చని ప్రకృతిలోనే, ఫలాలనిచ్చి, పసరులనిచ్చి, ప్రాణా లను నిలబెడుతున్న, కాపాడుతున్న వన సంజీవనిలోనే!
వాళ్లు, బతుకునిచ్చిన మట్టిని, చెట్టు పుట్టను, పారే నీటిని ఆరాధిస్తారు, అనుసరిస్తారు. ప్రకృతితో వారికున్న సంబంధంలోంచే సంస్కృతి జనించింది. సంప్రదాయమూ కొనసా గింది. అందులో మనకున్న ముప్పదికోట్ల మంది దేవతలుండరు. మూఢవిశ్వాసాలు నిండిన ఆచారాలుండవు. భ్రమాత్మక ప్రపంచాలుండవు. మతాలుండవు. మనుషుల మధ్య అసమానతలు సృష్టించిన కులాలుండవు.
వివక్షతలుండవు. సమస్త నాగరికత సృష్టించిన భయాలు, సంకెలలు, హింస, ఉన్మాదాలు, స్వార్థము, పగ, ద్వేషాలు, బారికేడ్లు, కంచెలు, వంచనలు ఏమీలేని స్వచ్ఛ సమూహ జీవనగానం వాళ్లది. వాళ్లది పురాతన చరిత్ర, ప్రకృతిని అనుసరించిన సంస్కృతి. లయతప్పని పయనం వాళ్లది. వాగు పరుగువంటి నడకతో, పక్షి పలుకువంటి సంభాషణలతో, ఆటలతో కోయిల పాటల స్వరాలతో, అమ్ముల పొది వేట, కొమ్ము బూర కోరస్ పాటలతో ప్రత్యేక మానవ సమూహం వాళ్లది. ఆ సమూహలకిప్పుడు ప్రమాదం ఏర్పడుతున్నది. కాపాడుకోవాల్సి అవసరం మనపై ఉన్నది. వాళ్ల హక్కులు హరించబడుతున్నాయి. అడవితో వారికి ఉన్న సంబంధాన్ని విరగగొడుతున్న విద్రోహాలు జరుగుతున్న వేళ మనమిప్పుడు ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ విధమైన సమూహలందరి కోసం ఐక్యరాజ్యసమితి ఆగస్టు తొమ్మిదిని ఆదివాసీ దినోత్సవంగా ప్రపంచ వ్యాపితంగానే జరుపుతున్నది. వారి భాష, సంస్కృతి పరిరక్షణ, హక్కుల రక్షణ మొదలయిన వాటిని ఈ సందర్భంగా చర్చించి చర్యలు తీసుకోవాలని భావించారు. అంటే దాని అర్థం, రక్షణ కోల్పోతున్నదని. ఆదివాసీ తెగల భాషలు కూడా అంతరించిపోతున్నాయి. గిడుగు రామ్మూర్తి పంతులుగారు ఆనాడే ఆదివాసీల భాషల ప్రాధాన్యతను గుర్తించి సవర భాషకు వ్యాకరణాన్ని సమకూర్చారు. భాష అంతరించడమంటే సంస్కృతి మొత్తం కనుమరుగై పోవడమే.
ఇప్పుడు ఆదివాసుల అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడుతోంది. ముఖ్యంగా అటవీ, కొండకోనల ప్రాంతం నుంచీ వారిని తరిమేసే ప్రయత్నం మొదలయింది. మన రాజ్యాంగంలోనే వారి జీవనానికి హక్కు చేయబడిన వాటిని తొలగించే చర్యలను నేటి ప్రభుత్వాలు చేస్తున్నాయి. జల్, జంగల్, జమీన్ అనే నినాదాన్ని వారికి కాకుండా చేస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగంచేసే ప్రభుత్వం, ఖనిజ సంపదను, లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేస్తున్నది. నిరసనలను, ప్రతిఘటనను అణచివేస్తున్నది. అందుకే కగార్‌ను తీసుకువచ్చింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నది. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్ హక్కులను హరిస్తున్నది. 1/70 చట్టాన్ని, పీసా చట్టాన్ని నిర్వీర్యం చేసే పనికి పూనుకుంటున్నది. నూతన ఫారెస్ట్ పాలసీని తెచ్చి వారి జీవితాలను ఛిద్రం చేస్తున్నది. ఇప్పటివరకు అడవిపై ఆధారపడి బతుకుతున్న ఆదివాసీలు అడవిని కానీ, పర్యావరణాన్ని కానీ పాడుచేయలేదు. ఇప్పుడు కార్పొరేట్ శక్తులు తమ లాభాల కోసం అడవిని విధ్వంస మొనరిస్తున్నారు. కొండలను, గుట్టలను తవ్విపారేస్తూ ఆదివాసీలకు ఆవాసమే లేకుండా వెడలగొడు తున్నారు. ఈ దోపిడీకి అడ్డుగా ఉన్న తెగల మధ్యన చిచ్చుపెడుతున్నారు.
రెండేండ్ల నుంచి రగులుతున్న మణిపూర్‌లో తెగల మధ్య విద్వేషాన్ని ఎగదోసారు. హత్యకాండకు పూనుకున్నారు. ఇదొకవైపు సాగుతూ, రెండవవైపు, వారి సహజ సంస్కృతిని జీవన ఆచారాలను దెబ్బతీసేందుకు వ్యూహాన్ని రచిస్తున్నారు. ఆదివాసులను వనవాసులని పిలిచి, మూలవాసుల చరిత్రను కుదిస్తున్నారు. హిందూ, క్రిస్టియన్, ఇతర మతాలతో సంబంధం లేని, గుడి, విగ్రహారాధన, మంత్ర తంత్రాలు లేనివారికి మతాలను అంటగంటే దౌర్జన్యమూ సాగుతోంది. వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాల్సింది పోయి, వారి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారు. వాళ్లను కాపాడుకోవాలి. ప్రకృతిని కాపాడుకోవాలి. ‘‘ఒక ఆదివాసీ పాడినప్పుడు/ఆశ్చర్యంగా ఒక నది పాడుతుంది / చెట్లు పాడతాయి సూర్యుడు, చంద్రుడు పాడతారు / మేఘాలు, వర్షం పాడతాయి, చివరికి ప్రతి అణువూ పాడుతుంది. అవును మాది కేవలం పిల్లల్ని నిద్రబుచ్చు భాష కాదు. ఈ ప్రపంచాన్ని నిద్రలేపే భాష’’ అని ఆదివాసీ కవయిత్రి జమునా బిని మాటల్లా నిద్రలేపాలని కోరుకుందాం.
అడవి బిడ్డలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



