13 నుంచి నిమ్స్‌లో ప్రారంభం
లండన్ వైద్య నిపుణుల సహకారంతో నిర్వహణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో పిల్లలకు పూర్తి ఉచితంగా గుండె శస్త్రచికిత్సలను నిర్వహిం చనున్నారు. నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్ అమరేశ్వర్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు కొనసాగనున్నాయి. లండన్‌కు చెందిన వైద్యులు, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నషునేని, సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో ఈ ప్రత్యేక శస్త్రచికిత్సలను చేపట్టనున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ ఉచిత గుండె శస్త్రచికిత్సల ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. అవసరాన్ని బట్టి ప్రాధాన్యతను కేటాయిస్తూ వాక్-ఇన్ విధానంలో చిన్నారులను పరిశీలించనున్నారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమున్న చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా శస్త్రచికిత్సలు చేయనున్నారు.
సోమవారం నుంచి శనివారం వరకు..
నిమ్స్‌లో నిర్వహించనున్న ఈ శస్ర్తచికిత్సల కోసం సోమవారం నుంచి శనివారం వరకు, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పంజాగుట్టలోని నిమ్స్ పాత బ్లాక్, మొదటి అంతస్తులోని
సీటీ సర్జరీ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. అపాయింట్‌మెంట్ అవసరం లేకుండా సంప్రదింపు సమయాల్లో నేరుగా రావొచ్చు. లేదంటే మిగతా వివరాలు, సందేహాల కోసం సిటీ సర్జరీ కార్యాలయం నెంబర్ 040-2348-9025 కు నేరుగా కాల్ చేయొచ్చు. శస్ర్తచికిత్సకు వచ్చే ముందు గతంలో చేయించిన వైద్య పరీక్షలు, నివేదికలను తీసుకురావాల్సి ఉంటుంది.
ఐదేండ్లుగా శస్త్రచికిత్సలు – నిమ్స్ డైరెక్టర్
ఐదేండ్లుగా ప్రతి ఏడాదీ నిమ్స్‌లో ఈ ఉచిత గుండె శస్త్రచికిత్స కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. యూకే వైద్యులు, సాంకేతిక నిపుణుల బృందం ద్వారా ఈ గుండె శస్త్రచికిత్సల కార్యక్రమం చేపటుడుతున్నట్టు చెప్పారు. గుండె శస్ర్తచికిత్స అవసరమైన, అర్హత ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరమూ లేకుండా, నిర్ణీత సమయాల్లో నిమ్స్‌కు నేరుగా రావాలని సూచించారు. సిటీ సర్జన్లు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ గోపాల్‌ను సంప్రదించొచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



