రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ చైర్మన్ కు వినతిపత్రం
కుల సంఘాల జెఏసి జిల్లా చైర్మన్ పీక కిరణ్
నవతెలంగాణ – మల్హర్ రావు
మహాముత్తారం మండలం కోనంపేట గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటిపి)లో కాంట్రాక్టర్ సాగిస్తున్న అక్రమాలు, నిధుల మళ్లింపు, ఎస్సీ, ఎస్టీ కార్మికులపై జరుగుతున్న శ్రమదోపిడీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బుధవారం వినతిపత్రం సమర్పించినట్లు కుల సంఘాల జేఏసీ (జెఏసి) జిల్లా చైర్మన్ పీక కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోనంపేట ప్లాంట్లో 60 నుండి 80 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా..కాంట్రాక్టర్ నిధులు మళ్లిస్తూ కేవలం 16 మందితోనే పనులు చేయిస్తున్నారని, పనిచేస్తున్న 16 మంది కార్మికులకు చట్టబద్ధంగా రావాల్సిన ఆదివారాల సెలవులు, పండుగ సెలవులు ఇవ్వకపోగా, ఓవర్‌టైమ్ (ఓటి) వేతనాలు కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. జీతాల నుండి పిఏప్, ఈఎస్ఐ మెడిక్లైమ్, పెట్రోల్ అలవెన్సుల పేరిట నెలకు రూ. 8,000 నుండి రూ. 12,000 వరకు అక్రమంగా కోతలు విధిస్తూ బాధితులను నిలువునా దోపిడీ చేస్తున్నారని తెలిపారు.
ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు మూడు సార్లు ఇచ్చినా ఫలితం లేదన్నారు. పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ ‘ప్రజావాణి’ ద్వారా వరుసగా మూడు సార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదా క్షేత్రస్థాయి విచారణ జరగలేదని, జిల్లా స్థాయిలో న్యాయం జరగకపోవడంతోనే ప్రజావాణి ఆధారాలన్నింటినీ జతచేసి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఇప్పటికైనా చైర్మన్ స్పందించి శ్రమదోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్, ఏజెన్సీపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్‌ను తక్షణమే ప్లాంట్ నిర్వహణ బాధ్యతల నుండి విధుల నుండి శాశ్వతంగా తొలగించాలన్నారు. కార్మికుల వేతనాల నుండి చట్టవిరుద్ధంగా కట్ చేసిన అలవెన్సుల బకాయిలను వడ్డీతో సహా వెంటనే తిరిగి చెల్లించాలని కోరారు. ప్లాంట్‌కు మంజూరైన 60-80 మంది పోస్టులకు పారదర్శకంగా పూర్తిస్థాయి రిక్రూట్‌మెంట్ జరిపించి, బాధిత ఎస్సీ, ఎస్టీ కార్మికులకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు.



