Tuesday, September 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅంతర్జాతీయవిద్య కోసం ప్రత్యేక టాస్క్‌‌ఫోర్స్‌

అంతర్జాతీయవిద్య కోసం ప్రత్యేక టాస్క్‌‌ఫోర్స్‌

- Advertisement -

దాని నాయకత్వ బాధ్యతలు నావే..
మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు అదే ఊపిరి..సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టీకరణ
విదేశీ పర్యటనపై నివేదిక అందజేసిన ‘తెలంగాణ రైజింగ్‌’ ప్రతినిధి బృందం
నర్సరీ నుంచే విద్యావ్యవస్థలో సమూల మార్పులు : నివేదికలో వెల్లడి

నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో
రాష్ట్ర విద్యార్థులు, యువతకు హైదరాబాద్‌లోనే ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన విద్య, నైపుణ్యాలు అందేలా రూపుదిద్దుకుంటున్న ప్రత్యేక ‘టాస్క్‌ఫోర్స్’కు తానే స్వయంగా నాయకత్వం వహిస్తానని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి ప్రకటించారు. దీన్ని వెంటనే అమల్లోకి తేవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యానికి ఇది ఊపిరి పోస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇటీవల బ్రిటన్, అమెరికా దేశాల్లో పర్యటించేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి అనుమతి ఇవ్వకపోవడంతో సీఎం లండన్‌ ‌పర్యటన ముగించుకొని హైదరాబాద్‌‌కు తిరిగి వచ్చేశారు. కానీ తెలంగాణ రైజింగ్‌ ‌ప్రతినిధి బృందం తమ పర్యటనను కొనసాగించింది. ఈనేపథ్యంలో సోమవారం ఆ బృందం సీఎం రేవంత్‌‌రెడ్డికి పర్యటన పూర్తి నివేదికను అందచేసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ విదేశీ పర్యటన, అంతర్జాతీయ వర్సిటీల భాగస్వామ్యం తెలంగాణ యువతరం భవిష్యత్‌‌కు ఊపిరి పోస్తుందని చెప్పారు. హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌’గా తీర్చిదిద్దేందుకు ఈ పర్యటన ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం విదేశీ పర్యటనలో సాధించిన చారిత్రాత్మక పురోగతి, ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలతో కుదిరిన కీలక ఒప్పందాలు, అవగాహనా ఒప్పందాలు (ఎమ్‌ఓయూలు), లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ)ల సమగ్ర వివరాలతో కూడిన ప్రత్యేక నివేదికను అందచేసింది. ఐటీ, పరిశ్రమలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్, పరిశోధన, డిఫెన్స్ రంగాల్లో రాష్ర్టాన్ని అంతర్జాతీయ విద్యా, నైపుణ్య రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

అమెరికాలోని అత్యుత్తమ ‘నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ’తో పాటు బ్రిటన్‌లోని 17 స్వతంత్ర విద్యాసంస్థల సమాఖ్య అయిన ‘యూనివర్సిటీ ఆఫ్ లండన్’ భారత్‌లోనే తమ తొలి ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన అంగీకారం తెలిపాయని నివేదికలో స్పష్టంచేశారు. నార్త్ ఈస్టర్న్ వర్సిటీ తమ క్యాంపస్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేసే అవకాశాలను ముమ్మరంగా పరిశీలిస్తున్నదనీ, ‘హార్వర్డ్ యూనివర్సిటీ’ హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్‌‌సీహెచ్చార్డీ) వేదికగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ రంగ ప్రతినిధుల కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను నిర్వహించేందుకు అంగీకరించినట్టు తెలిపారు. ఈ అంతర్జాతీయ కోర్సులు ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రత్యక్షంగా ప్రారంభమవుతాయని వివరించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లండన్ బిజినెస్ స్కూల్, వర్జీనియా టెక్, ఇంపీరియల్ కాలేజ్ లండన్ వంటి దిగ్గజ విద్యాసంస్థల అధిపతులతో తెలంగాన రైజింగ్‌ ‌ప్రతినిధి బృందం విస్తృత స్థాయి చర్చలు జరిపినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో సంయుక్త పరిశోధనా కేంద్రాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించామనీ, ఆయా సంస్థల నిపుణుల బృందాలు త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించి ప్రత్యక్షంగా ఇక్కడి వసతులను పరిశీలిస్తాయని తెలిపారు. నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు, ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్స్ యూనివర్సిటీల ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి వాటి ద్వారా విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని నివేదిక స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ హైదరాబాద్‌లో అంతర్జాతీయ విద్యా కేంద్రం (గ్లోబల్ నాలెడ్జ్ హబ్) ఏర్పాటైతే, మరిన్ని ప్రపంచ స్థాయి మల్టీనేషనల్ కంపెనీలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) తెలంగాణకు తరలివస్తాయని చెప్పారు. దీనివల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయనీ, తయారీ, పరిశోధన రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని వివరించారు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్‌‌సీహెచ్చార్డీ వైస్ చైర్‌పర్సన్ శాంతకుమారి, సీఎం సలహాదారు కే రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’లో ప్రపంచ విద్యాసంస్థల భాగస్వామ్యం, క్రీడా రంగ అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమాన్ని (ట్రాక్) నిర్వహిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -