2,023 కిలోమీటర్ల మేర డీపీఆర్ లు
రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సీఎస్ సమీక్ష
దక్షిణ మధ్య రైల్వే జీఎంతో సంజయ్ జాజు భేటీ
అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులకుపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్ తదితర ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలు, భూసేకరణ, వివిధ శాఖల నుంచి అవసరమైన పరిపాలనా అనుమతులు, రైల్వే ప్రాజెక్టుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయ సహకారాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. రైల్వే కనెక్టివిటీ. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక, ప్రాంతీయ అభివృద్ధికి అత్యంత కీలకమని సీఎస్ పేర్కొన్నారు. పెండింగ్ అంశాలను వేగంగా పరిష్కరించి, రైల్వే ప్రాజెక్టుల పనులను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు రూ.50,870 కోట్ల అంచనా వ్యయంతో 17 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి 2,023 కిలోమీటర్ల మేర విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌లను రైల్వే బోర్డుకు సమర్పించినట్టు అధికారులు సీఎస్‌కు వివరించారు.
పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి
రైల్వే అండర్‌పాస్‌లు, ఓవర్‌బ్రిడ్జిలు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, వివిధ రైల్వే మార్గాల డబ్లింగ్ పనులు, చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ప్రజా రవాణా సదుపాయాల మెరుగుదల తదితర సుమారు 21 అంశాలపై సమావేశంలో సమీక్షించారు. పెండింగ్ అంశాల పరిష్కారానికి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కలిసి సంయుక్త తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను గుర్తించాలని సీఎస్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఫ్యూచర్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు పరిధిలో రైల్వే లైన్ల విస్తరణకు తగిన ప్రణాలికలను సిద్ధం చేయాలని చెప్పారు. ప్రధానంగా మున్సిపల్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ తాగునీటి సరఫరా, సీవరేజ్ బోర్డు, రెవెన్యూ, విద్యుత్, రోడ్లు-భవనాల శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైల్వే ప్రాజెక్టుల అమలులో రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సీఎస్ స్పష్టం చేశారు.
పీఎం గతిశక్తి కింద నిధుల సమీకరణ
కేంద్ర ప్రభుత్వ పీఎం గతిశక్తి పథకం కింద నిధులు పొందేందుకు అవసరమైన సమగ్ర డీపీఆర్‌లను సిద్ధం చేయాలని సీఎస్ సూచించారు. అలాగే ఎంఎంటీఎస్ విస్తరణ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మహానగర పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు , రీజినల్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో టెర్మినళ్ల ఏర్పాటు, భవిష్యత్ రైల్వే కనెక్టివిటీతో పాటు బుల్లెట్ ట్రైన్ మార్గాలకు అవసరమైన భూసేకరణ తదితర అంశాలపై సమగ్ర డీపీఆర్‌లను సిద్ధం చేయాలని రైల్వే అధికారులకు సూచించారు. రాష్టాభివృద్ధికి అవసరమైన రైల్వే మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, మేడ్చల్-మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, సిటీ పోలీస్ జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సిద్దిపేట, హనుమకొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, నిర్మల్, జనగామ, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.



