అంగరంగ వైభవంగా చెరువుల పండుగ..

– బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నవతెలంగాణ – ఆర్మూర్
నియోజకవర్గంలోని 81 గ్రామాల్లో ఉన్న 220 చెరువుల వద్ద గురువారం పండగ వాతావరణం నెలకొంది. చెరువు కట్టలపై సకల జనుల కోలాహలం కనిపించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, మత్స్యకారులు వలల ఊరేగింపులతో గ్రామాలన్నీ సందడిగా కనిపించాయి. చెరువు కట్టలపై సభలు నిర్వహించారు. చెరువులను అందంగా తీర్చిదిద్దారు. చెరువుల గట్లను ముగ్గులు, తోరణాలతో అలంకరించారు. చెరువువద్ద కట్టమైసమ్మకు ప్రత్యేక పూజలు చేసారు.  ఆడపడుచులు నూతన వస్త్రాలు ధరించి పూలు, గాజులు, బొట్టుతో అలంకరించుకొని, వొంటిపై పసుపు రాసుకొని బోనాన్ని తలపై పెట్టుకొని డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా చెరువుల వద్దకు చేరుకున్నారు. బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. గ్రామదేవతలకు నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
బతుకమ్మ ఆడి కోలాటం వేశారు.  నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేశారు. ఆలూరు గ్రామంలోని కిష్టం చెరువు వద్ద జరిగిన సహపంక్తి భోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనే ప్రజలకు భోజనం వడ్డించారు. పట్టణంలోని పెర్కిట్ మామిడిపల్లి లలో సైతం చెరువుల పండుగ నిర్వహించినారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి చిన్నారెడ్డి,సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి,ఎంపిటీసి మల్లేష్,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love