నమస్తే నవనాథపురం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్
ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఏ వార్డు చూసినా అభివృద్ధి మయం అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. “నమస్తే నవనాధపురం”కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని 23వ వార్డులో జరిగిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఉదయం 23వ వార్డులో అడుగుపెట్టిన జీవన్ రెడ్డికి బస్తీ ప్రజలు ఘనస్వాగతం పలికారు. “కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, దేశ్ కీ నేత కేసీఆర్, జీవనన్న జిందాబాద్, జై తెలంగాణ” నినాదాలు చేస్తూ ఆయనను పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం ఆయన 23వ వార్డు అంతా కలియ తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ప్రజల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ‘అమ్మా బాగున్నారా అంటూ మహిళలను పలకరించారు. మీ కాలనీలో మిషన్ భగీరథ మంచినీళ్లు వస్తున్నాయా, నీళ్ల ట్యాంకులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్నారా, పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎవరికైనా మిషన్ భగీరథ కొత్త నల్లా కనెక్షన్లు అవసరమైతే వెంటనే నల్లా కనెక్షన్లు ఇవ్వాలని జీవన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొన్ని చోట్ల నీళ్లు రోడ్లపై వృధాగా పోవడాన్ని గమనించిన ఆయన మునిసిపల్ అధికారులను మందలించారు. డ్రైనేజీలను పరిశీలించిన జీవన్ రెడ్డి అవి మురికి కూపంలా ఉండడాన్ని గమనించి మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా దగ్గరుండి డ్రైనేజీలను క్లీన్ చేయించారు. ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంపై ఆ స్థలాల యజమానులపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఖాళీ స్థలాల్లో చెత్తను తొలగించి శుభ్రం చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. 23వ వార్డులోని భాషిత స్కూల్ సమీపంలో ఒక కల్వర్టు అవసరమని స్థానికులు జీవన్ రెడ్డి దృష్టికి తెచ్చారు. దీనిపై అక్కడికక్కడే స్పందించిన ఆయన త్వరితగతిన కల్వర్టు నిర్మాణం పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ వార్డులోని కుక్కలగుట్ట శివాలయంలో జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ గుడి సమీపంలోని కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను ఎమ్మెల్యే అక్కడికక్కడే పరిష్కరించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో దాదాపు 60వేల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నామని, 23వ వార్డులో లబ్ధిదారులకు సొంత స్థలాలలో త్వరలోనే ఇండ్ల నిర్మాణం కోసం రూ. మూడు లక్షల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. ఇండ్ల మీద ఉన్న కరెంటు తీగలను తొలగించి సురక్షిత ప్రాంతాలలో కొత్త గా స్తంభాలు వేయాలని ఆయన విద్యుత్ శాఖ అధికారులను కోరారు. 23వ వార్డులో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కావాలా అని స్థానికులను అడిగిన జీవన్ రెడ్డి అవసరమైన రోడ్లు వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. పరిశుభ్రతపై రాజీపడే ప్రసక్తే లేదని, ప్రతీ రోజు కాలనీలో చెత్త తొలగించి రోడ్లు శుభ్రంగా ఊడ్చాలని ఆయన మునిసిపల్ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణం అభివృద్ధి లో కొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు “ఇది అసలుసిసలైన ప్రజా ప్రభుత్వం. జనం కంట్లో సంతోషం చూస్తుంటే గర్వంగా ఉంది.ప్రజలే నా దేవుళ్ళు, అందుకే వారి వద్దకే వెళ్లుతున్నా. సబ్బండవర్గాలకు అండగా నిలుస్తా. ప్రజలకు ఏ కష్టమొచ్చినా అది నా కష్టమే అనుకుంటా. అన్ని వర్గాల ప్రజలు సారు, కారు,కేసీఆర్ వెంటే ఉన్నారు. హ్యాట్రిక్ విజయంతో చరిత్ర సృష్టిస్తాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయి. 2014లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయిన తరువాత పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా 82 గ్రామాల్లో ప్రజాదర్బార్లు నిర్వహించి దళిత వాడల్లో నిద్ర చేశాం. ఇప్పుడు నేను “నమస్తే నవనాధపురం” కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ మంచి నీళ్లొస్తున్నాయా?,పెన్షన్లు,రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ డబ్బులొస్తున్నాయా?,అని లబ్ధిదారులను నేరుగా అడిగి తెలుసుకుంటున్నా. ప్రతీ ఒక్కరూ చెప్పేది ఒకటే మేము సారు,కారు, కేసీఆర్ వెంటే ఉంటామని. అభివృద్ధి,సంక్షేమాన్ని అందిస్తున్న సర్కారు కు అండగా నిలిస్తేనే మనం మరింత ముందుకు పోతాం అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నమస్తే నవనాథ పురం కార్యక్రమంలో పాల్గొన్నఅధికారులకు, ప్రజా ప్రతినిధులకు జీవన్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అయ్యప్ప లావణ్య శ్రీనివాస్, కౌన్సిలర్ ఈ టడి నర్సారెడ్డి, మునిసిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్, ఏఈ రఘుకుమార్, ఆర్మూర్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు పూజ నరేందర్, పార్టీ ముఖ్య నాయకులు తమ్మి శ్రీనివాస్, రవిగౌడ్,అంజా గౌడ్, నరేష్, పండిత్ వినీత పవన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love