మట్టి నుంచి పుట్టిన సినిమా

ఎ.బి. సినిమాస్‌, నిహాల్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై రమేష్‌ చెప్పాల రచన-దర్శకత్వంలో డాక్టర్‌ బత్తిని కీర్తిలత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. ఈ చిత్రంలో బలగం ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి, అంజి వల్గమాన్‌, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచే ఆర్గానిక్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ నేపథ్యంలో శనివారం ప్రసాద్‌ ల్యాబ్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కష్ణమోహన్‌రావు మాట్లాడుతూ, ”బలగం’ మాదిరిగానే ‘భీమదేవరపల్లి బ్రాంచి’ కూడా విజయవంతం కావడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. ‘మట్టి నుంచి పుట్టిన సినిమా ఇది. ప్రజల జీవన విధానాలను, వారిలోని ఎమోషన్స్‌ను బేస్‌ చేసుకుని చక్కని కథను తయారు చేసుకుంటే సక్సెస్‌ ఖచ్చితంగా వస్తుంది అని మరోసారి నిరూపించిన అద్భుతమైన సినిమా ఇది’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన రాజా నరేందర్‌ చెట్లపెల్లి మాట్లాడుతూ, ‘ప్రేక్షకుల్ని అద్భుతంగా మెప్పించిన ఇలాంటి మంచి చిత్రానికి నిర్మాత కావడం చాలా గర్వంగా ఉంది’ అని తెలిపారు. నిర్మాత డాక్టర్‌ బత్తిని కీర్తిలత గౌడ్‌ మాట్లాడుతూ,’ఇందులో నేను హీరోయిన్‌ తల్లిగా నటించాను. అటు నటిగా, ఇటు నిర్మాతగా నాకు మంచి పేరు తెచ్చిన చిత్రమిది’ అని అన్నారు. ‘తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని పెంచే సినిమా ఇది. గ్రామీణ నేపథ్యంతో పాటు రాజకీయ పార్టీలు ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాయి అనే నగ సత్యాన్ని వినోదంతో చెప్పాం. అందుకే ప్రజలు మా సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు’ అని దర్శకుడు రమేష్‌ చెప్పాల తెలిపారు.

Spread the love