ఆధారాలు దొరక్కుండా రూ.5 వేలను నమిలి మింగేసిన ప్రభుత్వాధికారి..

Madhya-Pradeshనవతెలంగాణ – మధ్యప్రదేశ్‌
లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా బుక్కైపోయిన ఓ అధికారి, వారికి ఆధారాలు దొరక్కుండా కరెన్సీ నోట్లను నమిలి మింగేశాడు. మధ్యప్రదేశ్‌లో కట్నీ జిల్లాలోని బర్ఖేడా గ్రామంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పట్వారీగా పనిచేస్తున్న గజేంద్ర సింగ్ తనను లంచం అడిగాడంటూ ఓ వ్యక్తి అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో, వారు గజేంద్ర సింగ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు వలపన్నారు. సోమవారం గజేంద్ర సింగ్ తన వ్యక్తిగత ఆఫీసులో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారి రాకను దూరం నుంచే గమనించిన గజేంద్ర సింగ్ తన చేతిలోని కరెన్సీ నోట్లను గబగబా నమిలి మింగేశాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అతడు క్షేమంగానే ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.

Spread the love