మోడీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

నవతెలంగాణ – న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం ఉదయం 9.30గంటలకు ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో లోక్‌సభలో ఈ వర్షాకాల సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సంస్థాగత అంశాలపై కూడా చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, మణిపూర్‌లో హింసాకాండపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమయ్యాయి. మూడో రోజైన సోమవారం కూడా మణిపూర్ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. చర్చకు సిద్ధమేనని చెప్తూ, చర్చకు రావాలని ప్రభుత్వం కోరుతోంది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను సభ నుంచి సస్పెండ్ చేయడంతో ప్రతిపక్షాలు అకస్మాత్తుగా ధర్నాకు దిగాయి. మరోవైపు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూసివ్ అలయెన్స్ కూటమి పార్టీలు మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో మంగళవారం సమావేశమవుతాయి. రాజ్యసభలో అనుసరించవలసిన వ్యూహంపై ప్రతిపక్ష నేతలు ఈ సమావేశంలో చర్చిస్తారు. మణిపూర్ సమస్యపై చర్చించాలని, మిగిలిన అంశాలను వాయిదా వేయాలని కోరుతూ ఎంపీలు రాజ్యసభలో రూల్ 267 ప్రకారం నోటీసులు ఇచ్చారు.

Spread the love