జీవితంలోని మంచీ చెడుల గురించే తెలిపే సినిమా

దర్శకుడు నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా ‘సర్కిల్‌’. ఈ చిత్రంలో సాయి రోనక్‌, బాబా భాస్కర్‌, అర్షిణ్‌ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఎమ్‌.వి శరత్‌ చంద్ర, టి సుమలత అన్నిత్‌ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నాయికలు అర్షిణ్‌ మెహతా, రిచాపనై ఆదివారం మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
అర్షిణ్‌ మెహతా మాట్లాడుతూ, ‘సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘భజరంగీ భాయిజాన్‌’ చిత్రంలో జర్నలిస్ట్‌ పాత్రతో నా కెరీర్‌ మొదలుపెట్టాను. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాను. ఇప్పటిదాకా ఇక్కడి చిత్రాల్లో నటించిన అనుభవం లేదు. నీలకంఠ నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌. ఆయన చిత్రంలో అవకాశం రావడం సంతోషంగా ఉంది. క్యారెక్టర్‌, నటన విషయంలో ఆయన చాలా పర్టిక్యూలర్‌గా ఉంటారు. ఈ సినిమాతో నటిగా చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఇందులో ప్రిన్సెస్‌ పాత్ర నాది. హీరో ఫొటోగ్రాఫర్‌. వీరి మధ్య జరిగే ప్రేమ కథ ఆసక్తికరంగా ఉంటుంది. మన జీవితం అంటే మంచీ చెడుల సర్కిల్‌. ఈ చిత్రంలోనూ అదే విషయాన్ని చెప్పబోతున్నాం. సాయి రోనక్‌ మంచి కోస్టార్‌. ఎలాంటి ఇబ్బంది లేకుండా అతనితో కలిసి నటించాము. తెలుగులో చాలా మంది స్టార్‌ హీరోలు ఉన్నారు. ఇకపై ఇక్కడ మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను’ అని చెప్పారు.
రిచా పనై మాట్లాడుతూ, ‘కెరీర్‌లో గ్యాప్‌ కావాలని తీసుకున్నది కాదు. ‘యముడికి మొగుడు, చందమామ కథలు, ఈడు గోల్ట్‌ ఎహె’ వంటి చిత్రాల్లో నటించాను. ‘బృందావనమది అందరిదీ’ సినిమాలో నటించినా అది విడుదల కాలేదు. ఆ తర్వాత మంచి అవకాశాలు వస్తాయని ఆశించాను కానీ అనుకున్నంతగా సినిమాలు దక్కలేదు. ఇండిస్టీకి దూరమవడం ఇష్టం లేక వచ్చిన రెండు మూడు చిత్రాల్లో నటించాను. ఇప్పుడు ఈ చిత్రంలో నటించాను. ఈ చిత్రంలో నా క్యారెక్టర్‌ను దర్శకుడు నీలకంఠ కొత్తగా ప్రెజెంట్‌ చేయబోతున్నారు. బోల్డ్‌గా కనిపించే పాత్ర నాది. అయితే డిఫరెంట్‌గా ఉంటుంది. నేను ఇలాంటి క్యారెక్టర్‌ ఇప్పటిదాకా చేయలేదు. ఈ సినిమా నటిగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. హీరో లైఫ్‌ చుట్టూ కథ తిరుగుతుంది. ఆయన వెంట మేముంటాం. నేను పెయింటర్‌ పాత్రలో కనిపిస్తా. ఇవాళ అమ్మాయిలు ఎంత మోడరన్‌గా, ఫ్రీడమ్‌తో ఉన్నారో అలాగే తెరపై కనిపిస్తా. రొమాంటిక్‌, యాక్షన్‌, థ్రిల్లర్‌, ఎంటర్‌టైనింగ్‌..ఇలా కథలో అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. మాంటేజ్‌ సాంగ్స్‌ ఆకర్షణ అవుతార. ఈ సినిమా నాకు మంచి కమ్‌ బ్యాక్‌ అవు తుంది’ అని అన్నారు.

Spread the love