దేశ భవిష్యత్తుకు ఓ..హెచ్చరిక

దేశ భవిష్యత్తుకు ఓ..హెచ్చరికఅక్కడ జరుగుతున్న సభ నక్సల్స్‌ది కాదు, పాకిస్తాన్‌ నుంచి అక్రమంగా చొరబడిన టెర్రరిస్టులది అంతకన్నా కాదు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రచిస్తున్న ప్రణాళిక కూడా కానే కాదు. ఎక్కడో ఆడవి లోనో, రహస్య ప్రదేశంలో పెట్టుకున్న సమావేశం కూడా కాదు. దేశంలో అంతరిస్తున్న ప్రజాస్వా మ్యాన్ని కాపాడు కోవాలనే ధృడ సంకల్పంతో కలాలు, గళాలు ఒక్కటైన వేళ.. వరంగల్‌ నగరం నడిబొడ్డున కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసుకున్న ‘సమూహ’ లౌకిక వేదికది. దేశాన్ని మనువాదంతో పాలించాలనుకునే ఆరెస్సెస్‌ పరివారానికి చెందిన ఏబీవీపీ ఈ సభపై దాడి చేయడం హేయమైన చర్య. దేశంలో ఇలాంటి దారుణాలు, మారణహోమాలు, విద్వేషపూరిత ఘర్షణలు జరగకుండా ఉండేందుకు, సమాజంలో లౌకిక స్ఫూర్తిని పెంపొందించే దృక్పథంతో అభిప్రాయాల్ని పంచుకుంటున్న సభపైనే ఈ దాడి జరగడం అత్యంత శోచనీయం. ఇలాంటి ఘటనలు చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా అనే అనుమానం కలుగుతున్నది. సగటు మనిషిగా హృదయం ఆవేదనతో రగిలిపోతున్నది.
దేశాన్ని మనువాదంతో పాలించాలను కుంటున్న బీజేపీకి ఇలాంటి సభలు, సమావేశాలు రుచిం చడం లేదు. ‘సమూహ’ సభపై జరిగిన దాడే కాదు, ఇటీవల హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ లో కూడా ప్రగతిశీల భావాలు గల కార్యక్తలపై ఏబీవీపీ నాయకులు దాడికి పూనుకున్నారు. ఈ మధ్య అక్కడ జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీపై ఎస్‌ఎఫ్‌ఐ కూటమి విజయం సాధించిన విషయం విదితమే. సంగారెడ్డిలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా వాల్‌పోస్టర్లు, బ్యానర్లు కడుతున్న కార్య కర్తలపై ఇలాగే ఘర్షణకు దిగారు. వారిపై కట్టెలతో దాడి చేయడంతో ఒకరి తలపగిలి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.ఇలాంటి ఘటనలు మొదలు కాదు, ముగింపు కాదు. నిత్యం ఏదోఓ చోట జరుగు తున్నవే. గతేడాది భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు బైరి నరేష్‌పైన కూడా ఇలాంటి దాడే జరిగింది.
నిజామా బాద్‌ జిల్లా కోటగిరిలో ఓ ఉపాధ్యా యుడు గణేష్‌ చందా ఇవ్వనందుకు హిందూ దేవతల్ని అవమానిం చాడని కొంత మంది విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు ఆందోళన చేసి అతన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో క్షమాపణ చెప్పించారు. ఇలా బీజేపీ-ఆరెస్సెస్‌ అనుబంధ సంఘాలైన ఏబీవీపీ, భజరంగ్‌దళ్‌, విశ్వహిందూ పరిషత్‌, రెచ్చిపోయి దాడులకు తెగబడటం, తద్వారా ఘర్షణా పూరిత వాతావరాణాన్ని నెలకొల్పి ఉద్వేగాలను రెచ్చగొట్టడం పరిపాటిగా మారింది. దీన్ని అడ్డుకట్ట వేసేందుకు వారి నాయకత్వం చొరవ తీసుకోకపోవడం చూస్తుంటే హింసను ప్రేరేపించ డంలో భాగమే ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తోందనే అభిప్రాయానికి రావాల్సి వస్తున్నది.
‘సమూహ’ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో ‘లౌకిక విలువలు-సాహిత్యం’ అనే అంశంపై జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సుపై వ్యూహాత్మకంగానే దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సదస్సుకు సంబంధించి చాలా రోజుల ముందు నుంచే కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, సోషల్‌ మీడియాలో ప్రచా రం జరిగింది. సెనెట్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో పలు జిల్లాల నుంచి లౌకిక వాదాన్ని బలపరిచే మేధావులు, విద్యావంతులు, కవులు, రచయితలు హాజరయ్యారు. వారంతా రాజ్యాంగం కల్పించిన హక్కుల రక్షణకు చేయాల్సిన కృషిపై ప్రసంగిస్తుండగా అడ్డుకుని దాడిచేశారు. బ్యానర్లు, ప్లెక్సీలు చింపివేశారు. డాక్టర్‌ పసునూరి రవీందర్‌తో సహా ముగ్గురు కవులకు గాయాలయ్యాయి. ఇలాంటి భౌతికదాడులు ఒకప్పుడు రాజకీయ పార్టీల్లోనే కనిపించేవి. కానీ బీజేపీ మతోన్మాద అరాచక పాలనపై సాహిత్యం ఉద్భవిస్తూ, సామాన్యులను కూడా ఆలోచింపజేస్తున్న తరుణంలో కవులు, రచయితల సభలపైన మనువాద మూక దాడులు పెరిగాయి.
భిన్నభిప్రాయాలు కలిగి ఉండేదే ప్రజాస్వామ్యం. విమర్శల్ని స్వీకరించి పాలనలోని లోపాలను సరిచేసుకోవాల్సిన బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రశ్నించేవారిని వేధిస్తున్నది. ఉపా చట్టం కింద నిర్బంధి స్తున్నది. చాలామందిని హతమారు స్తుననది. నిలదీసే వారిని దేశ ద్రోహులుగా ముద్రవేసి ప్రజాస్వామ్య పు గొంతు నులిమేస్తున్నది. వారి ఆగడాలకు, దుశ్చర్యలకు ఎవరూ అతీతులు కాదు. జర్నలిస్టులు, పౌర హక్కుల నాయకులు, ప్రొఫెసర్లు, రైటర్స్‌ అందరూ బాధితులే. వారి బారినపడి జైళ్లలో మగ్గుతున్నవారే.
మరి ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతుంటే ప్రజలు ఎంతకాలమని భరిస్తారు? ప్రశ్నకు సమాధానం, సమస్యకు పరిష్కారం కూడా దొరకని ఈ రాజ్యంలో ఎంతకాలం స్వేచ్ఛను కోల్పోతారు? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే దేశంలో మతోన్మాదులు ఆ విలువల్ని నడిరోడ్డుపై గొయ్యితీసి పాతరేస్తుంటే ప్రజాస్వామ్యానికి ఇక దిక్కెవరు?
ఈనెల 13న ప్రజల కర్తవ్యమేంటో ఈ ఘటనల తర్వాతనైనా స్పష్టమవ్వాలి. భారత రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని ప్రజల నెత్తిన రుద్దేందుకే ఈ చర్యలన్నీ దారితీస్తాయి. ‘సమూహ’ పై దాడి కూడా దాన్లో భాగమే.
ఎన్‌ అజయ్ కుమార్‌

Spread the love