మరో 8 మెడికల్‌ కాలేజీలు వచ్చే ఏడాదే ప్రారంభం

– ప్రతిపాదనలు ఇవ్వండి : మంత్రి టీ హరీశ్‌రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 25 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామనీ, వచ్చే విద్యా సంవత్సరానికి మిగిలిన 8 జిల్లాల్లో నూతన మెడికల్‌ కాలేజీలకు ప్రతిపాదనలు రూపొందిం చాలని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. 9 ఏండ్లలో 21 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసి దేశంలోనే రికార్డు సష్టించామన్నారు.
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో శుక్రవారంనాడాయన వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హెల్త్‌ సెక్రెటరీ రిజ్వి, కమిషనర్‌ శ్వేతా మహంతి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో విశాలాక్షి ,డిఎంఇ రమేష్‌ రెడ్డి, డిహెచ్‌ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్‌ అజరు కుమార్‌ , టిఎస్‌ఎం ఎస్‌ఐడిసి ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 8 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న మెడికల్‌ కళాశాలలకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారుల్ని ఆదేశించారు. స్పెషాలిటీ సేవలు జిల్లా పరిధిలోనే అందాలనే ఉద్దేశ్యంతోనే మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా వందో రోజుకు చేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 99 పనిదినాల్లో కోటి 61 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 40.59 లక్షల మందికి దష్టిలోపం ఉన్నట్టు గుర్తించామనీ, 22.51 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసులు, 18.08 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్‌ గ్లాసెస్‌ పంపిణీ చేసినట్టు అధికారులు వివరించారు.

Spread the love