ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు సిడ్నీ, ఆక్లాండ్‌లో ముందుగా.

న్యూఢిల్లీ : 2024 నూతన సంవత్సర వేడుకలు ప్రపంచవ్యాప్తంగా హోరెత్తాయి. సిడ్నీ, ఆక్లాండ్‌ నగరాల్లో ఈ వేడుకలు ముందుగా ప్రారంభమయ్యాయి. సిడ్నీ హార్బర్‌, ఆక్లాండ్‌లోని స్కై టవర్‌ వద్ద అద్భుతమైన బాణసంచా ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. సిడ్నీ హార్బర్‌ వంతెనపై సుమారు 12 నిమిషాలపాటు టన్నుల కొద్దీ బాణసంచా కాల్చారు. ఈ వేడుకను చూడ్డానికి ఇతర దేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చారు. ఆక్లాండ్‌లోని 328 మీటర్ల ఎత్తయిన కమ్యూనికేషన్స్‌ అండ్‌ అబ్జర్వేషన్‌ టవర్‌పై కాల్చిన బాణాసంచా నగరం మొత్తాన్ని వెలుగులతో నింపింది. వాటికన్‌ సిటీలో నూతన సంవత్సర వేడుకల ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 2023ను యుద్ధ బాధల సంవత్సరంగా పోప్‌ ఫ్రాన్సిస్‌ గుర్తు చేసుకున్నారు. సెయింట్‌ పీటర్స్‌ స్వ్కేర్‌కు ముందున్న కిటీకి నుంచి పోప్‌ సాంప్రదాయ ఆశీర్వాదం ఇచ్చారు. బాధించబడుతున్న ఉక్రెయిన్‌, పాలస్తీనా, ఇజ్రాయిల్‌, సూడాన్‌ ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల ప్రజల కోసం పోప్‌ ఫ్రాన్సిన్‌ ప్రార్థనలు చేశారు. ‘యుద్ధంలో ఎన్నో మానవ జీవితాలు ఛిద్రమయ్యాయి. ఎంతోమంది మరణించారు. ఎన్నో బాధలు, ఎంతో పేదరికాన్ని బాధితులు అనుభవిస్తున్నారు’ అని పోప్‌ తెలిపారు.న్యూయార్క్‌ నగరంలో టైమ్స్‌ స్వ్కేర్‌ వద్ద వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు బెదిరింపులు రావడంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డ్రోన్లతోనూ నిఘా పెట్టారు. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో నూతన వేడుకలకు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. 2024లో పారిస్‌లో ఒలింపిక్స్‌ జరుగుతుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డిసెంబర్‌ 2న ఈఫిల్‌ టవర్‌ వద్ద కత్తిపోట్ల సంఘటన చోటు చేసుకోవడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. జర్మనీ బెర్లిన్‌లోనూ వేడుకలకు భారీగా మోహరించారు. వీధుల్లో ఫైర్‌ క్రాకర్ల వాడకంపై అధికారులు నిషేధం విధించారు. పాలస్తీనా వాసులకు సంఘీభావంగా పాకిస్తాన్‌లో నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం నిషేధం విధించింది.

Spread the love