పైలాన్ ను ఆవిష్కరించనున్న
సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిం చనున్నారు. ఉదయం 9:30 గంటలకు ఆయన అక్కడకు చేరుకుంటారు. విద్యార్థుల తో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. విద్యా సంస్కరణల్లో భాగంగా ఆరుట్లలో ఏర్పాటు చేసిన ఈ మొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అత్యాధునిక వసతులతో రూపొందించినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ చర్యతో విద్యారంగంలో నూతన విద్యా విప్లవం ప్రారంభమవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రారంభం అనంతరం సీఎం పాఠశాలలోని డిజిటల్ క్లాస్‌రూములు, లైబ్రరీ, సైన్స్ ల్యాబులు, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.
కార్పొరేట్‌కు ధీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్
రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి విద్యారంగ బలోపేతానికి సూచనలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి, సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్ రావు,, డాక్టర్ చారకొండ వెంకటేష్, జోష్నా శివారెడ్డి ల ప్రత్యేక పర్యవేక్షణలో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రూపుదిద్దుకుంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తున్నారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరగనుంది. ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా తెలంగాణ విద్యకు రోల్ మోడల్‌గా తెలంగాణ పబ్లిక్ స్కూల్ రూపుదిద్దుకుంది. పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రభుత్వం నాలుగు పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు తెలిపారు.
కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ వాతావరణం కనిపిస్తోంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, విద్యార్థులకు విశాలమైన ప్లేగ్రౌండ్స్, ల్యాబ్స్, గాలి-వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్‌తో పాటు క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు ఏర్పాటు చేశారు. ఆయా క్రీడలకు ప్రత్యేక శిక్షకులను కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి ఐదు స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ప్రయివేటు స్కూళ్లలో చదువుతున్న పిల్లలను సైతం టీపీఎస్‌లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ-ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ స్కూల్‌లో 600 మంది, హైస్కూల్ రెండు బ్లాకుల్లో కలిపి 800 మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోలేక ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి టీపీఎస్‌లో నెలకొంది.



