నటుడిగా, నిర్మాతగా మళ్ళీ పెళ్లి.. పెద్ద ప్రయోగం

నరేష్‌ వి.కె నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. యూనిక్‌ కథతో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర ్‌టైనర్‌లో పవిత్ర లోకేష్‌ కథానాయికగా నటించారు.
ఎం ఎస్‌ రాజు రచన, దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్‌ బ్యానర్‌ పై నరేష్‌
ఈ చిత్రాన్ని నిర్మించారు.
నేడు (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో నరేష్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
‘9వ యేట ‘పండంటి కాపురం’తో నటుడిగా నా ప్రయాణం మొదలైంది. 18వ యేట ‘నాలుగు స్తంభాలాట’తో హీరోగా మారాను. నటుడిగా, నిర్మాతగా, స్టూడియో ఓనర్‌గా నా ప్రయాణం చాలా బాగా కొనసాగింది. నా సినీ జీవితంలో 50వ యేట, అలాగే విజయ్‌ కృష్ణ మూవీస్‌ స్థాపించి 50 ఏళ్ళు.. ఇవన్నీ కలసి వచ్చి.. మళ్ళీ హీరోగా ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేయడం నా అదృష్టం. విజయ్‌ కృష్ణ మూవీస్‌ని 1972లో స్థాపించారు. అమ్మ (విజయ నిర్మల) చాలా మంచి చదువరి. ఆమె ఆలోచనలను సినిమాల్లో చూపించాలని కృష్ణగారితో కలసి ఈ సంస్థకు శ్రీకారం చుట్టి, ‘మీనా, కవిత..’ ఇలా ఎన్నో విప్లవాత్మక చిత్రాలు తీశారు. ఈ బ్యానర్‌ని మళ్ళీ మొదలు పెడితే మరో సంచలనాత్మక, విప్లవాత్మక చిత్రంతో రావాలని అనుకున్నాం. దర్శకుడు ఎం.ఎస్‌. రాజు చెప్పిన ‘మళ్ళీ పెళ్లి’ కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు షాకింగ్‌గా ఉంటుంది.
పెళ్లి అనేది చాలా పవిత్రమైనది. దాన్ని గౌరవించాలానే కోణంలో ఈ సినిమా చేశాం. దీన్ని తెలుగుతో పాటు కన్నడలో కూడా చేశాం. ఈ సినిమాపై యూత్‌లో చాలా బజ్‌ వచ్చింది. అన్ని ఏజ్‌ గ్రూపుల వారికి కనెక్ట్‌ అయ్యే కంటెంట్‌ ఇందులో ఉంది. డీసెంట్‌ ఓపెనింగ్స్‌తో విజరు కృష్ణ మూవీస్‌లో పెద్ద హిట్‌ కొడతామనే నమ్మకం ఉంది. అంతేకాదు ఈ సినిమా ఆటమ్‌ బాంబ్‌లా పేలుతుంది.
‘డర్టీ హరి’ చూసినప్పుడే దర్శకుడు రాజు గారితో కనెక్ట్‌ అయ్యాను. వేరే సబ్జెక్ట్‌ని చేయాలని అనుకున్నాం. అదే సమయం కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిని ఆయన పరిశీలించి, ఒక రోజు, ‘నేను ఒక కథ చెబుతాను .. అది మీకు, ప్రపంచానికి కనెక్ట్‌ అవుతుంది’ అన్నారు. అలా ఈ ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ అయ్యింది. అయితే ఇది బయోపిక్‌ కాదు. ఇది ఏమిటనేది 26న తెలుస్తుంది. ఈ సినిమా ఇప్పటి సొసైటీని ఫోకస్‌ చేస్తుంది. అలాగే కృష్ణ పాత్ర కూడా చూపిస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఒక సెలబ్రిటీ జీవితాన్ని తీసుకున్నాం. మదర్‌, ఫాదర్‌ పాత్రలు కూడా ఉంటే బావుంటుందని అనుకున్నాం. అయితే ఆ పాత్రల గురించి ఇప్పుడే రివీల్‌ చేయకూడదు. సినిమా చూసిన తర్వాత సర్‌ప్రైజ్‌ అవుతారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. నటుడిగా, నిర్మాతగా ఈ సినిమా ఒక పెద్ద ప్రయోగం. ఓ హిట్‌ సినిమా తీశానని నిర్మాతగా నమ్మకంగా ఉన్నాను’ అని చెప్పారు.

Spread the love