ఏ సమయంలోనైనా ..

– లోక్‌సభ ఎన్నికలు : నితీశ్‌కుమార్‌
పాట్నా : 2024 లోక్‌సభ ఎన్నికలు ఏ సమయంలోనైనా ముందస్తుగానే జరగవచ్చని బిహార్‌ ముఖ్యమంత్రి, జెడియు నితీశ్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యత నేపథ్యంలో తమకు మరింత నష్టం జరుగుతుందని బిజెపి భయపడుతోందని.. అందువల్ల ముందుగానే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. నలంద ఓపెన్‌ యూనివర్సిటీ ప్రారంభోత్సవం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార ఎన్‌డిఎ ముందస్తుగానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ఏడెనిమిది నెలల నుంచే చెబుతున్నానన్నారు. బిజెపిని ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు కచ్చితంగా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం వెనుక తనకు ఎలాంటి పదవీకాంక్షలేదని మరోసారి స్పష్టంచేస్తున్నానన్నారు. ఎన్నికలకు ముందు సాధ్యమైనన్ని పార్టీలను బిజెపికి వ్యతిరేకంగా ఏకం చేయడమే తన కోరిక అన్నారు. ఇండియా వేదికలోకి మరికొన్ని పార్టీలు రాబోతున్నాయంటూ ఇటీవల వ్యాఖ్యానించిన ఆయన ఆ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. అలాగే, రాష్ట్రంలో కులగణన ప్రక్రియ పూర్తయిందన్న బీహార్‌ ముఖ్యమంత్రి త్వరలోనే వాటిని ప్రచురించనున్నట్టు వెల్లడించారు. వివరణాత్మక డేటా ప్రచురించాక, ఇతర రాష్ట్రాలు సైతం దీన్ని కచ్చితంగా అనుసరిస్తాయని తాను భావిస్తున్నట్టు చెప్పారు. కులాల వారీగా సర్వే చేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్రంలో బిజెపి సహా అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీసుకున్నట్టు చెప్పారు.

Spread the love