పెరిగిన ‘ఉపాధి హామీ’ లబ్దిదారులు

– బలహీన రుతుపవనాలే కారణం
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. గత సంవత్సరం జూన్‌ నెలతో పోలిస్తే ఈ ఏడాది ఈ పథకం కింద లబ్ది పొందిన కుటుంబాల సంఖ్య 10 శాతం పెరిగి 3.04 కోట్లకు చేరింది. గత మూడు సంవత్సరాలలో లబ్దిదారుల సంఖ్య ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. 2014 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకూ మూడు పర్యాయాలు మాత్రమే లబ్ది పొందిన కుటుంబాల సంఖ్య మూడు కోట్లు దాటింది. గతంలో 2020 మే లోనూ (3.3 కోట్లు), 2020 జూన్‌ లోనూ (3.89 కోట్లు) ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య మూడు కోట్లు దాటింది. ఆ సమయంలో కోవిడ్‌ మహమ్మారి దేశాన్ని కుదిపివేస్తుండడంతో జీవనోపాధి పొందలేకపోయిన పేద కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందగలిగాయి. జూన్‌లో రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో వ్యవసాయ పనులు సాగక ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులలో పేద కుటుంబాలు భాగస్వాములయ్యాయని ఇండియా రేటింగ్స్‌ సంస్థకు చెందిన ప్రధాన ఆర్థికవేత్త దేవేంద్ర కుమార్‌ పంత్‌ తెలిపారు. వర్షపాతం అన్ని ప్రాంతాలలో సమానంగా పడకపోవడంతో ఖరీఫ్‌ పంటలు వేసుకోవడంలో జాప్యం జరిగిందని, దీంతో ప్రజలు ఈ పథకాన్ని ఎంచుకొని ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. వర్షపాతం పెరిగితే వీరి సంఖ్య తగ్గుతుందని ఆయన చెప్పారు. కాగా కోవిడ్‌ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగుల సంఖ్య పెరగడం, రాష్ట్రాలకు కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేయడం కూడా లబ్దిదారుల సంఖ్య పెరగడానికి కారణమేనని భారత మాజీ ప్రధాన గణాంకవేత్త ప్రణబ్‌ సేన్‌ విశ్లేషించారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుండే ఉపాధి హామీ పథకం లబ్దిదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏప్రిల్‌లో 2.07 కోట్ల కుటుంబాలు ఈ పథకంలో చేరగా, మే నాటికి ఆ సంఖ్య 2.86 కోట్లకు పెరిగింది. జూన్‌లో లబ్ది పొందిన 3.03 కోట్ల కుటుంబాలలో తమిళనాడుకు చెందిన కుటుంబాలే 51.80 (17 శాతం) లక్షలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 33.14 లక్షలు, రాజస్థాన్‌లో 32.68 లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 32.10 లక్షలు, బీహార్‌లో 22.36 లక్షల కుటుం బాలు ప్రయోజనం పొందాయి. పది రాష్ట్రాలలో పది లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు ఈ పథకంలో చేరాయి. కేంద్రం నిధులు నిలిపివేయడంతో పశ్చిమబెంగాల్‌లో ఉపాధి హామీ పనులు నిలిచిపో యాయి. జూన్‌లో కేవలం 962 కుటుంబాలు మాత్రమే లబ్ది పొందాయి. గత సంవత్సరం ఇదే నెలలో 4.94 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందాయి. మొత్తం మీద జులై 16 నాటికి దేశంలోని 4.15 కోట్ల కుటుంబాలు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేంద్రం ఈ పథకానికి రూ.60 వేల కోట్లు కేటాయించింది. వీటిలో ఈ నెల 16 వరకూ మూడింట రెండు వంతుల నిధులు ఖర్చయ్యాయి.

Spread the love