నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నరేంద్రమోడీ తొమ్మిదేండ్ల పాలనపై మహాజన సంపర్క్ అభియాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలోనే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షులు జేపీ.నడ్డాతో మూడు బహిరంగ సభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదన్న విషయాన్ని కొట్టిపడేశారు. గురువారం నుంచి ఏడో తేదీ వరకు పార్లమెంట్ వారీగా సమావేశాలు, సోషల్‌మీడియా టీమ్‌లతో భేటీలు నిర్వహించాలని సూచించారు. వికాస్ తీర్థ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను సందర్శించాలన్నారు.