ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోంది

పార్లమెంటు నూతన భవన ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవకపోవడం అవమానకరం
– ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవకపోవడం అవమానకరమైన విషయమని, ఎందుకు పిలవలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గుడవర్తి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గ సమావేశానికి తమ్మినేని వీరభద్రం హాజరై మాట్లాడారు. పార్లమెంట్‌ భవన్‌ ప్రారంభంలో కూడా ప్రతిపక్షాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, 19 పార్టీలు బారు కాట్‌ చేసినా సరే అత్యంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ భవనాన్ని ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం, దాన్ని వెనక నుంచి నడిపిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ దేశాన్ని మత రాజ్యంగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నాయని, అందుకే రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పాత రాచరిక వ్యవస్థను తీసుకువచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతిలో వారి విధానాలు ఉన్నాయన్నారు. అందుకే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతతత్వ విధానాలను వెనక్కి కొట్టేందుకు క్యాడర్‌ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కర్నాటకలో లాగా దేశం నుంచి కూడా బీజేపీని తరిమేసే సమయం ఆసన్నమైందని, మతోన్మాద రాజకీయాలు ఇక మీదట సాగవని స్పష్టంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాటాలను ఉధృతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జూన్‌, జూలై నెలల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్టు
తెలియజేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌, బుగ్గవీటి సరళ, జిల్లా కమిటీ సభ్యులు షేక్‌ బషీరుద్దీన్‌, సుదర్శన్‌ రెడ్డి, మండల కార్యదర్శులు కొమ్ము శ్రీను, కె.వి.రెడ్డి, నియోజకవర్గ నాయకులు అంగిరేకుల నరసయ్య, రామారావు, తోటకూర రాజు, గంగాధర్‌, పొన్నెకంటి సంగయ్య, కృష్ణ, నాగేశ్వరరావు, వీరన్న, సురేష్‌, కట్టెకోల వెంకన్న, తమ్మినేని వెంకట్రావు, రంజాన్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love