‘బిబిసి’పై బీజేపీ కక్ష!

BJP party on 'BBC'!బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బిబిసి) భారత్‌లో తన ప్రసారాలను నిలిపివేయడం మీడియా రంగానికి మరో కుదుపు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌డిఐ నిబంధనలను మార్చడంతోపాటు గతంలో ఆ సంస్థ కార్యాలయాలపై దాడులు చేసిన పర్యవసానంగా జరిగిన పరిణామమిది. గుజరాత్‌ మారణకాండ వెనుక నేటి ప్రధాని, ఆనాటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాత్ర గురించిన డాక్యుమెంటరీని బిబిసి ప్రసారం చేయడమే కేంద్రం కక్షకు అసలు కారణం. ఏతావాతా పరిశీలిస్తే మోడీని లేదా సంఫ్‌ు పరివార్‌కు వ్యతిరేకంగా ఎవరైనా వాస్తవాలు వెల్లడిస్తే వారిని వేటాడడం, హింసించడమే కేంద్ర ప్రభుత్వం పరమ కర్తవ్యంగా పెట్టుకుందని, అందుకు నిబంధనాల చట్రాన్ని బిగిస్తుందనీ మరోసారి విదితమయ్యింది.
బిబిసి కార్యాలయాలలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం, ప్రశ్నలు సంధించడం, వేధింపులు సాగించి సంవత్సరం కూడా పూర్తికాకముందే బిబిసి భారత్‌లోని తన న్యూస్‌రూమ్‌ను మూసేసింది. నలుగురు బిబిసి మాజీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ‘కలెక్టివ్‌ న్యూస్‌రూమ్‌’ పేరిట ఏర్పడిన ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీకి బిబిసి ప్రచురణ లైసెన్సును అప్పగించింది. ఇలా అప్పగించడం ఓ అసాధారణమైన చర్య. అంతర్జాతీయంగా ప్రసార సేవలందిస్తున్న ఓ పబ్లిక్‌ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఇది మన దేశ ప్రతిష్టకు మాయని మచ్చ.బ్రిటన్‌ వెలుపల మన దేశంలోనే బిబిసి కార్యకలాపాలు పెద్ద ఎత్తున నడుస్తుండడం ప్రత్యేకించి పేర్కొనదగినది.
1940 మేలో ప్రసారాలను ప్రారంభించిన బిబిసి ఇండియా బ్యూరోలో ఇప్పుడు సుమారు 200 మంది పనిచేస్తున్నారు. 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్లపై బిబిసి ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది రోజులకే గత సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ, ముంబయిలోని ఆ సంస్థ కార్యాలయాలలో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు, సోదాలు జరగడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేసినా ఆ సంస్థ మన దేశంలో తన కార్యకలాపాలను నిలిపివేయడానికి లేదా స్థాయి తగ్గించడానికీ ఇష్టపడలేదు. ఉద్యోగాలలో కోత విధించలేదు. అదే సమ యంలో ఆర్థికంగా ఇబ్బందులు తీవ్రం కావడంతో గుక్కతిప్పుకోలేక పోయింది. దేశీయ డిజిటల్‌ మార్కెట్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) పరిమితి 26 శాతం మాత్రమేనని నూతన నిబంధనల్ని 2021లో కేంద్రం విధించింది. ఆ పరిమితి దాటిన కంపెనీలు తమ విదేశీ పెట్టుబడులను నియంత్రణలకు అనుగుణంగా తగ్గించుకోవాలి లేదా మూత వేసుకోవాల్సి ఉంటుంది.
బిబిసి ఇండియాలో 99.9 శాతం ఎఫ్‌డిఐ కావడంతో ఆ కొత్త నిబంధన గుది బండగా మారింది. ఈ నేపథ్యంలో విధి లేని పరిస్థితులలో కార్యకలాపాలను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకోవలసి రావడం విచారకరం. తాజా పరిణామాలపై బిబిసి న్యూస్‌ డిప్యూటీ సిఒఒ జోనాథన్‌ మన్రో ‘భారత్‌లో బిబిసి మనుగడకు ఘన చరిత్ర ఉంది. ప్రేక్షకులకే తొలి ప్రాధాన్యత ఇచ్చాం. దానిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కలెక్టివ్‌ న్యూస్‌రూమ్‌ ఏర్పాటు దోహదపడుతుందని వ్యక్తం చేసిన ఆశాభావం నెరవేరుతుందని ఆకాంక్షిద్దాం. జర్నలిజంలో రాజీ పడబోమని, తమ వెనుక బిబిసి ఉన్నదని కలెక్టివ్‌ న్యూస్‌రూమ్‌ సిఇఒ రూపా ఝా స్పష్టం చేయడం దానికి మరింత బలం చేకూరుస్తుంది.
మీడియా గొంతు నొక్కడం నరేంద్ర మోడీ ప్రభుత్వ నిత్యకృత్యంగా ఉంది. పాత్రికేయుల్ని జైళ్లలో కుక్కడం, స్వతంత్ర వార్తా సంస్థలు, పోర్టల్‌లపై ఉపా వంటి రాక్షస చట్టాలను ప్రయోగించడం మనం చూస్తున్నాం. న్యాయ స్థానాలు, అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలూ కొన్ని సందర్భాల్లో అభిశంసిస్తున్నా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నవ్విపోదురు గాక అన్నట్టు వ్యవహరిస్తోంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్‌లో 180 దేశాల్లో భారత్‌ 161వ స్థానంలో ఉండడం సిగ్గుచేటు. ఈ దుస్థితి పోవాలంటే ప్రస్తుత కార్పొరేట్‌ మతతత్వ కూటమి పాలన అంతం కావలసిందేతప్ప మరో మార్గం లేదు. అందుకు ప్రజలంతా నడుం బిగించాలి.

Spread the love