బీజేపీ ఓటమి ప్రజాస్వామికవాదుల బాధ్యత

బీజేపీ ఓటమి ప్రజాస్వామికవాదుల బాధ్యత– రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ బీజేపీ ఓటమికి కృషి చేయాలి
– కాంగ్రెస్‌ మహబూబ్‌నగర్‌ పార్లమెంటు అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి
– సామాజిక తరగతులకు అన్యాయం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
– మద్దతు కోరిన వంశీచంద్‌రెడ్డి
నవతెలంగాణ -మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిథి
భావ సారూప్యం కల్గిన పార్టీలు, వ్యక్తులు రాజ్యాంగం పట్ల గౌరవం కల్గిన ప్రతి ఒక్కరూ బీజేపీ ఓటమికి కృషి చేయాలని కాంగ్రెస్‌ మహబూబ్‌నగర్‌ పార్లమెంటు అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో సామాజికంగా, ఆర్థికంగా పేదలకు సహాయ సహకారాలు అందలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ తెలిపారు. సీపీఐ(ఎం) మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యాలయానికి శుక్రవారం చల్లా వంశీచంద్‌రెడ్డి వచ్చారు. నాయకులతో మాట్లాడి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మద్దతు కోరారు. వామపక్షాలు, దాని ప్రజాసంఘాలు క్షేత్ర స్థాయిలో పనిచేసి కాంగ్రెస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. మతతత్వ బీజేపీని ఓడించడానికి సర్వశక్తులా ప్రయత్నం చేస్తామన్నారు. దేశంలో బీజేపీని నామరూపం లేకుండా చేయాలని, అప్పుడే రాజ్యాంగానికి రక్షణ ఉంటుందని అన్నారు. ఇండియా కూటమి ద్వారా దేశ లౌకిక విధానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. రాష్ట్రంలో సీపీఐ(ఎం) బరిలో ఉన్న భువనగిరి తప్ప మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించడానికి తమ పార్టీ శ్రేణులు పనిచేస్తాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, రైతులు, ఉద్యోగులు సమ్మె చేయకుండా చట్టాలు మార్చారన్నారు. కేంద్ర సంస్థల్లో పనిచేసే చిరుద్యోగులకు వేతనాల పెంపు లేకుండా చేయడమేగాక ఉపాధి హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రతి ఒకరూ ఐక్యతతో కృషి చేయాలని కోరారు. బీఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. దేశంలో 24 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వీటి కోసం 40 కోట్ల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. లౌకిక విధానాలకు గొడ్డలిపెట్టుగా మారిన బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శి ఎ.రాములు, వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌, నారాయణపేట జిల్లా కార్యదర్శి వెంకట్‌రామిరెడ్డి, రాష్ట్ర నాయకులు వెంకట్‌రాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కిల్లె గోపాల్‌, కురుమూర్తి, చంద్రకాంత్‌, ప్రశాంత్‌ ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.

Spread the love