ఆలెన్‌ ఫార్మాలో అగ్ని ప్రమాదం

ఆలెన్‌ ఫార్మాలో అగ్ని ప్రమాదం– వెల్డింగ్‌ పనులు చేస్తుండగా అంటుకున్న మంటలు
– తాడు సహాయంతో పలువురిని కాపాడిన యువకుడు
– పలువురికి స్వల్ప గాయాలు
– యువకుడు సాయిచరణ్‌ను అభినందించిన ఎమ్మెల్యే
– రంగారెడ్డి జిల్లా నందిగామలో ఘటన
నవతెలంగాణ-కొత్తూరు
ఆలెన్‌ ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఓ యువకుడు తాడు సహాయంతో కార్మికులను కాపాడాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండల కేంద్రంలో గల ఆలెన్‌ ఫార్మా పరిశ్రమలో కార్మికులు వెల్డింగ్‌ పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న ధర్మకోల్‌పై నిప్పురవ్వలు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో సుమారు 150 మంది విధులు నిర్వహిస్తున్నారు. కార్మికులు బయటకు పరిగెత్తుకొచ్చారు. ఐదుగురు కార్మికులు పరిశ్రమ లోపల చిక్కుకుపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే నందిగామ గ్రామానికి చెందిన యువకుడు సాయిచరణ్‌ తాడు సహాయంతో పరిశ్రమ కిటికీ నుంచి లోపలికి వెళ్లి వారిని కిందకి తీసుకొచ్చాడు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్‌ ఇంజిన్లతోపాటు స్థానిక వాటర్‌ ట్యాంకుల సహాయంతో మంటలను ఆర్పుతున్నారు.
అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలుగా శ్రమిస్తున్నా మంటలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.సాయిచరణ్‌ను అభినందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, డీసీపీ నారాయణరెడ్డి అగ్ని ప్రమాదం సమయంలో ధైర్య సాహసాలతో పరిశ్రమ భవనంపైకి వెళ్లి తాడు సాయంతో పలువురు కార్మికుల ప్రాణం కాపాడిన యువకుడు సాయిచరణ్‌ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, డీసీపీ నారాయణరెడ్డి, అడిషనల్‌ డీసీపీ రామ్‌కుమార్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌ రాజేశ్వర్‌, పోలీస్‌ అధికారులు, స్థానికులు అభినందించారు. పోలీసులు ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. విచారణ చేపట్టిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Spread the love