హైదరాబాద్‌లో బీసీల్లేరా? వారు కార్పొరేటర్లు కావొద్దా?

No BC in Hyderabad? Aren't they corporators?– బీఆర్‌ఎస్‌, ఎంఐఎం బీసీ సీట్లను ముస్లింలకు కేటాయించాయి
– కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జీహెచ్‌ఎంసీ పరిధిలో బీసీల్లేరా? వారు కార్పొరేటర్లు కావొద్దా? 50 సీట్లు బీసీలకు రిజర్వు అయితే 31 సీట్లలో ముస్లిం కార్పొరేటర్లు ఉన్నది వాస్తవం కాదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయాలని సవాల్‌ విసిరారు. సిగ్గులేకుండా ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తున్నారనీ, దేశంలో కనుచూపుమేరల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ్ల కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశాన్ని ముంచడం ఖాయమన్నారు. తమది పక్కా లోకల్‌ పార్టీ అనీ, ఐఎన్‌సీ అంటేనే ఇటలీ నేషనల్‌ కాంగ్రెస్‌ అని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలు దిగజారి మాట్లాడుతున్నారన్నారు. బ్రిటీష్‌ ప్రతినిధిగా ఇటలీకి చెందిన సోనియాగాంధీని దేశంపై రుద్దే ప్రయత్నం చేస్తే బీజేపీ అడ్డుకున్నదని చెప్పారు. దేశంలో సమస్యలన్నింటికీ కాంగ్రెస్సే కారణమనీ, ఆ పార్టీ దేశానికి పట్టి దరిద్య్రం అని విమర్శించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు గండికొట్టి ముస్లిం రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారని ప్రశ్నించారు. తాము ఈబీసీ రిజర్వేషన్లను తెచ్చామనీ, రిజర్వేషన్లను ఎందుకు తొలగిస్తామని నిలదీశారు. ఎమర్జెన్సీతో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ కాలరాసిందనీ, ఇప్పుడు ఆ పార్టీ వాళ్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బతికున్న సమయంలో, చనిపోయాక అంబేద్కర్‌, పీవీ నర్సింహారావులను కాంగ్రెస్‌పార్టీ అవమానించిందని వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పంచ తీర్థాల పేరుతో అంబేద్కర్‌ను మోడీ ప్రభుత్వం గౌరవించిందన్నారు. తెలంగాణను పదేండ్లలో సర్వనాశనం చేసింది కేసీఆర్‌ అని విమర్శించారు. రాహుల్‌గాంధీ వయస్సు అయిపోయిందనీ, టీషర్టు, జీన్స్‌ వేసుకున్నంత మాత్రాన ఆయన వెంట యువత రాదని చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీలే ఆ పార్టీకి భస్మాసుర అస్త్రాలుగా మారుతాయన్నారు. ఒట్లు పెట్టుకుంటూ పోతే ఓట్లు పడవని సీఎం రేవంత్‌రెడ్డికి చురకలు అంటించారు. ఎన్నికల తర్వాత తన కుర్చీ ఎక్కడ పోతుందో అన్న భయంతో ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ రామ్‌గోపాల్‌రెడ్డి తనయుడు ముదుగంటి వెంకట శ్రీనివాస్‌ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలు జిట్టా రాజేందర్‌రెడ్డి, కళ్లెం మోహన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love