హరీశ్‌రావు ఓ జోకర్‌ స్పీకర్‌ ఫార్మెట్‌లో రాజీనామా లేఖ ఇవ్వాలి

హరీశ్‌రావు ఓ జోకర్‌ స్పీకర్‌ ఫార్మెట్‌లో రాజీనామా లేఖ ఇవ్వాలి– ఆయనదంతా ఓ డ్రామా
– రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ ముంచింది
– బీజేపీకి తెలంగాణ రావడం ఇష్టం లేదు : మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర రాజకీయాల్లో హరీశ్‌రావు ఓ జోకర్‌గా మారారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. స్పీకర్‌ ఫార్మెట్‌లో రాజీనామా చేయకుండా, రెండు పేజీల లేఖతో అమరవీరుల స్థూపం వద్ద ఆయన డ్రామాలాడారని ఎద్దేవా చేశారు. పదేండ్లపాటు అధికారంలోకి ఉన్న బీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని ముంచిందన్నారు. అసలు తెలంగాణ రావడం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్‌ ప్రకటిస్తే.. ఆ ఒక్క హామీ కాదు.. మొత్తం 13 హామీలు నెరవేర్చాలనీ, లేదంటే రాజీనామకు సిద్ధం కావాలని సవాల్‌ చేస్తూ.. ఓ డూప్లీకేట్‌ రాజీనామాతో ఆయన కొత్త నాటకానికి తెరదీశారని విమర్శించారు. గతంలో పెట్రోల్‌ పోసుకుని అగ్గి పెట్టె దొరక లేదంటూ ఆనాడు ఎలాగైతే డ్రామాలాడి వందలమంది అమాయకపు బిడ్డలను పొట్టన పెట్టుకున్నడో.. ఇప్పుడూ ఆయన మళ్లీ అదే డ్రామాను ఆరంభించారని ఎద్దేవా చేశారు. ఆయన డ్రామాలు చిన్నపిల్లలకు కూడా తెలిసిపోయాయని ఎద్దేవా చేశారు.
ఆర్ధిక మంత్రిగా ఉండి ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం చేతకాని దద్దమ్మ అని విమర్శించారు. మామ, అల్లుళ్లు చేసిన లక్షల కోట్ల అప్పులకు ప్రతీనెల రూ. 26వేల కోట్ల వడ్డీలు కడుతున్నామని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్‌ పూర్తిగా మూతపడుతుందని తెలిపారు. ఆ పార్టీలో హరీశ్‌ ఓ సర్వెంట్‌గా ఓనరు ఏం చెప్తే అదే చేయాల్సిందేనన్నారు. మామ తర్వాత తానే సీఎం అవుతా అన్నట్టు ఆయనకు ఆయనే ఊహించుకుని ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆనాటి అగ్గిపెట్టె మోసానికి, ఈనాటి రాజీనామా నాటకానికి ఏమాత్రం తేడా లేదన్నారు. హరీశ్‌రావుకు దమ్ముంటే మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంలో డిపాజిట్‌ దక్కించుకోవాలని సవాల్‌ విసిరారు. ఈఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడే తొమ్మిది సీట్లు గెలిచిన కేసీఆర్‌… ప్రతిపక్షంలో ఉండి 8 నుంచి 12 సీట్లు వస్తాయంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. హరీశ్‌రావు డ్రామాలు బంద్‌చేసి అక్రమంగా సంపాదించిన సొమ్ముతో దుబారుకో, ఇంకెక్కడికైనా వెళ్లి బతికితే మంచిదని హెచ్చరించారు.

Spread the love