రాజీనామా లేఖతో హరీశ్‌రావు

resignation Harish Rao with the letter– అమరవీరుల స్థూపం వద్ద నివాళి 
– రేవంత్‌ రాజీనామాకు ముందుకు రాలేదంటే మోసగించినట్టే
– కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌
నవతెలంగాణ-అంబర్‌పేట్‌
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్లో ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ ఈ ఏడాది ఆగస్టు 15 వరకు అమలు చేస్తే రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిజమైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా పత్రంతో హైదరాబాద్‌ గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్దకు రావాలని సవాల్‌ విసిరారు. శుక్రవారం హరీశ్‌రావు తన రాజీనామా లేఖతో అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌ను స్వీకరించి తన రాజీనామా పత్రంతో వచ్చానని తెలిపారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వాలని చెప్పారు. అమలు చేయకపోతే రేవంత్‌ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలన్నారు. రేవంత్‌ రాలేని పక్షంలో తన సిబ్బందితోనైనా రాజీనామా పత్రాన్ని పంపించాలని సూచించారు. అందరి ముందు ఇద్దరి రాజీనామా పత్రాలను పెడదామన్నారు. రేవంత్‌రెడ్డి రాజీనామాకు ముందుకు రావట్లేదంటే ప్రజలను మోసగించినట్టేనన్నారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసం చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల పేరుతో ఇప్పటికే మోసం చేసిందని ఆరోపించారు. డిసెంబర్‌ 9న రుణమాఫీ చేస్తానని మాటిచ్చి తప్పిందని.. సోనియమ్మ మాట అంటూ రేవంత్‌ రెడ్డి ప్రజలను మోసం చేశారని అన్నారు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తమకు రాజీనామాలు లెక్క కాదన్నారు. రైతుల రుణమాఫీ కోసం రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. రేవంత్‌ రెడ్డి సిద్ధమా కాదా అనేది తేల్చుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడమే తమ కర్తవ్యమన్నారు. తన రాజీనామాను జర్నలిస్టుల చేతికి ఇచ్చి వెళ్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కాలేరు వెంకటేష్‌, కేపీ వివేకానంద, గోపాల్‌, బండారి లక్ష్మారెడ్డి అక్కడకు చేరుకుని హరీశ్‌రావుకు మద్దతు తెలిపారు.
అమరవీరుల స్థూపానికి శుద్ధి
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమరవీరుల స్థూపాన్ని హరీశ్‌రావు వాడుకుంటున్నారంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌ ఆధ్వర్యంలో స్థూపాన్ని పసుపునీళ్లతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా బల్మూర్‌ వెంకట్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో నిరుద్యోగులు, యువతను హరీశ్‌రావు పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడం వల్ల ఈ ప్రాంతం మైల పడిందని, అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేశామని తెలిపారు. పదేండ్లు బీఆర్‌ఎస్‌ నాయకులకు అమరవీరులు గుర్తుకు రాలేదని.. ఇప్పుడు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ స్థూపాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు.

Spread the love