రుణమాఫీ చేస్తా..

రుణమాఫీ చేస్తా.. –  మీ పార్టీని రద్దు చేస్తారా?
– కేసీఆర్‌, హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌ సవాల్‌

– పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత మాది
– డీకే అరుణతో మాకెలాంటి పోటీ లేదు
– బీజేపీ నేతలకు పిచ్చిపట్టింది..మోడీవల్ల తెలంగాణకు ఉపయోగం లేదు :నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ సభల్లో సీఎం
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా.. చెప్పిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం.. రైతులెవరూ అధెర్యపడొద్దు. బ్యాంకులు రైతులను ఇబ్బంది పెట్టొద్దు. రుణమాఫీ చేసే బాధ్యత నాది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గడువులోపు రుణమాఫీ చేస్తే బీఆర్‌ఎస్‌ పార్టీని రద్దు చేస్తారా?.. అని కేసీఆర్‌, హరీశ్‌రావులకు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. పదేండ్లు అధికారంలో ఉన్నా ఇచ్చిన హామీలను కేసీఆర్‌ నెరవేర్చలేదన్నారు. కేసీఆర్‌ చేసిన అప్పులకు తాము ఇప్పటికే రూ.24 వేల కోట్లు వడ్డీ కట్టామన్నారు. కాంగ్రెస్‌పార్టీ పూర్తికాలం అధికారంలో ఉంటుందని, ఐదేండ్లలో పాలమూరు- రంగారెడ్డితో పాటు తుమ్మిళ్ల, కేఎల్‌ఐ, కొడంగల్‌ నారాయణపేట ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామని తెలిపారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరు, నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లిల్లో నిర్వహించిన కాంగ్రెస్‌ సభల్లో సీఎం రేవంత్‌ ప్రసంగించా రు.’పాలమూరు బిడ్డకు బూర్గుల రామకృష్ణారావు తర్వాత 70 ఏండ్లకు ముఖ్యమంత్రిగా అవకాశమొచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఉపయో గించుకొని రాజకీయాలకు అతీతంగా సలహాలు సూచనలు ఇచ్చి జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సహకరించాలి’ అని మద్దూర్‌లో జరిగిన కొడంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సభలో రేవంత్‌ కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడంలోనూ, ఉద్యోగాలను భర్తీ చేయడంలోనూ, నిధులను వెచ్చించడంలోనూ ఈ జిల్లాపై వివక్ష చూపిందని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉందన్నారు. కేసీఆర్‌ ఎంపీగా ఉన్నా మహబూబ్‌నగర్‌ను పట్టించుకోలేదన్నారు. రాజోలి, తుమ్మిళ్ల, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పూర్తయితే జిల్లా వ్యవసాయంలో అభివృద్ధి చెందుతుందన్నారు. దొంగలకు సద్ది మూటలు మోసే నేతలు మన జిల్లాలో కొందరు ఉన్నారని, అలాంటివారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. జాతీయ ఉపాధ్యక్షులు డికె.అరుణ, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో తమకు ఎలాంటి వివాదం లేదన్నారు. ‘నరేంద్ర మోడీ కత్తి.. పాలమూరు కడుపులో పొడిచేందుకు ప్రయత్నిస్తోంది. దాని గురించే ఆందోళన తప్ప ఆమెతో నాకు పోటీ లేదు. ఆమె సొంత ఊరిలోనే ఆ పార్టీ డిపాజిట్‌ కోల్పోయింది.. ఆమెకు నాకు ఏం పోటీ. కొడంగల్‌ను దొంగ దెబ్బ తీసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు కుట్రలు చేస్తున్నారు’ అని డికే అరుణ్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘నాకు పాలమూరులో శత్రువులు.. ప్రత్యర్థులు ఎవ్వరూ లేరు” అని రేవంత్‌ స్పష్టం చేశారు. ఆనాడు మంత్రిగా ఉన్న అరుణ.. మక్తల్‌ నారాయణపేట కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నారని తెలిపారు. ఇంట్లో గెలిచి.. రచ్చ గెలవాలని అంటారని.. మన ఇల్లు కొడంగల్‌.. ఇక్కడ మనం పెద్ద మెజార్టీతో గెలవాలని కోరారు. బీజేపీ నేతలకు పిచ్చి పట్టిందని ఆరోపించారు. తామంతా హిందువులం.. పూజలు చేసిన వాళ్లమేనని భక్తి మన గుండెల్లో ఉండాలన్నారు. వారు గోడలమీద రాస్తూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పదేండ్లు తెలంగాణకు ఏమీ చేయలేదన్నారు. అందుకే సమాజంలో విభజన తెచ్చి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచందర్‌ పాల్గొన్నారు.
నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ గెలిస్తే.. ఆయనను మోడీ కాళ్ల కింద పెట్టడం ఖాయమని బిజినేపల్లి సభలో రేవంత్‌ అన్నారు. దొరల గడీలకు వ్యతిరేకంగా మాట్లాడి.. నియంతృత్వ విధానాలపై పోరాడి, గురుకుల ముఖ్య కార్యదర్శి పదవికి రాజీనామా చేసి.. బీఎస్పీలోకి.. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ చెంతకు ఎందుకు చేరారని ప్రశ్నించారు. ఏ లక్ష్యంతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారో.. అది బీఆర్‌ఎస్‌లో ఎన్నటికీ నెరవేరదన్నారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో పట్టుబడితే మార్షల్స్‌ చేత గెంటేయించిన కేసీఆర్‌ వర్గీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ నుంచి తలపడుతున్న భరత్‌ ప్రసాద్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎంత పెద్ద దోమ అయినా ఏనుగు తొండానికి సరిపడదన్నారు.
కమ్యూనిస్టులు, ప్రజాస్వామ్య శక్తుల బలంతో మల్లు గెలుపు
నాగర్‌ కర్నూల్‌లో కమ్యూనిస్టులు, ప్రజాస్వామ్య శక్తుల బలంతో మల్లు రవి గెలవడం ఖాయమని సీఎం అన్నారు. 120 రోజుల కాలంలోనే ఇచ్చిన ఆరు హామీలలో ఐదు హామీలను నెరవేర్చి ప్రజల దీవెనలు పొందుతున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రెండు లక్షల రుణమాఫీ, రాజీవ్‌ ఆరోగ్య బీమా తదితర అనేక కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించి.. రెండు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, మెఘా రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి, నాయకులు రాజేష్‌రెడ్డి, రవీందర్‌ నాయక్‌, సతీష్‌ మాదిగ సరిత, తిరుపతయ్య, ఓబేదుల కొత్వాల్‌, మన్నెమ్మ పాల్గొన్నారు.

Spread the love