రూ.5000 కోట్ల సమీకరణలో బిఒబి

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బిఒబి) రూ.5,000 కోట్ల నిధులను సమీకరించనుంది. 2024 మార్చి 31 నాటికి కాపిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ అదనపు టైర్‌-1, టైర్‌-2 ద్వారా నిధులను పొందడానికి ఆ బ్యాంక్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు శుక్రవారం ఆమోదం తెలిపారు. భారతదేశం, విదేశాలలో పరస్పర మార్పిడి ఆప్షన్‌తో కూడిన మూలధన సాధనాల ద్వారా విడతల వారిగా ఈ నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు బిఒబి రెగ్యూలేటరీ సంస్థలకు తెలిపింది. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో బిఒబి నికర వడ్డీ ఆదాయం పెరగడంతో లాభాలు 168 శాతం వృద్థితో రూ.4,775 కోట్లుగా నమోదయ్యాయి. 2022-23లో స్థూలంగా 94 శాతం పెరిగి రూ.14,110 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇంతక్రితం ఏడాది రూ.7,272 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2022-23కు గాను రూ.10 ముఖ విలువ కలిగిన షేర్‌పై రూ.5.5 డివిడెండ్‌ను సిఫారసు చేస్తూ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.

Spread the love