ఇంజక్షన్ వికటించడంతో బాలుడు మృతి

– కలెక్టరేట్, ఒకటవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాలం చెల్లిన ఇంజెక్షన్ ఇవ్వడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ధర్పల్లి మండలానికి చెందిన 10 నెలల బాలుడు గత నెలలో అస్వస్థతకు గురి కాగా ఖలీల్వాడిలోని ఓ చిన్న పిల్లల ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఐదు రోజులు వైద్యం తర్వాత బాలుడి ఆరోగ్యం మెరుగైంది. తీరా డిశ్చార్జి చేసే సమయంలో ఓ ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత బాలుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించాలని సదరు ఆస్పత్రి వైద్యుడు సూచించాడు.హైదరాబాద్ కు తరలించే సమయంలో బాలుడు మృతి చెందాడు. తీరా కుటుంబీకులకు అనుమానం వచ్చి ఇంజక్షన్ గురించి ఆరా తీయగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే గడువు ముగిసినట్లు గుర్తించారు. అనంతరం ఈ విషయమై కలెక్టర్ తో పాటు ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ విషయాన్ని గుర్తించిన ఆస్పత్రి యాజమాన్యం తమకు తప్పుడు బిల్లులు ఇచ్చిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషయంలో కాలం చెల్లిన ఇంజక్షన్లు, మందులు ఇవ్వడం వల్ల ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని సాధారణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్పందించి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Spread the love