– పొంగిపొర్లుతున్న శనిగకుంట పెద్దఒర్రె
నవతెలంగాణ-మంగపేట
మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాల్లోని చెరువులు మత్తళ్లు పడి పొంగిపొర్లు తుండగా అబ్బాయిగూడెం ప్రధాన రోడ్డుకు గండి పడి వరద ఉద్రుతంగా ప్రవహిస్తుండగా శనిగకుంటకు వెళ్లే దారిలోని పెద్ద ఒర్రె సైతం పొంగిపొర్లుతూ రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని పలు గ్రామాల లోతట్టు ప్రజలు వరదల్లో గడుపుతున్నారు. సహాయకచర్యలు సైతం చేపట్టకుండా వర్షాలు కురుస్తుండడంతో పాటు ప్రధానం గ్రామాల్లో పారిశుద్య పనులు చేపట్టాల్సిన గ్రామపంచాయతీ సిబ్బంది నిరసన దీక్షల్లో ఉండడంతో ఒకింత సహాయ చర్యలకు ఇబ్బంది కలుగుతుంది. మండల అధికారులు స్థానికంగా ఉన్న గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇతర అధికారులతో ఆయా గ్రామాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎడతెరపిలేని వర్షాలు మరో రెండు మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండడంతో మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే తిమ్మంపేట పెద్ద చెరువు, రామచంద్రునిపేట ఊర చెరువు, మంగపేట ఊర చెరువు, చెరుపల్లి చెరువులు నిండి మత్తళ్లు దునికేందుకు సిద్దంగా ఉండి నిండు కుండను తలపిస్తున్నాయి. మండల కేంద్రంలోని గౌరారం వాగు, కమలాపురం ఎర్రవాగు, మల్లూరు వాగు, రాజుపేట ముసలమ్మవాగులు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి సైతం వరద ఉద్రుతితో ప్రవహిస్తుండగా లోతట్లు ప్రాంతాలైన మంగపేట పొద్మూరు. సినిమాహాల్ వడ్డెర కాలనీ, కమలాపురం, చుంచుపల్లి, వాడగూడెం, రాజుపేట, అకినేపల్లి మల్లారం గ్రామాల ముంపు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముంపు ప్రాంత ప్రజలను ఏ సమయంలోనైన పునరావాస కేంద్రాలకు తరలించేందకు రెవిన్యూ, పోలీస్ అధికారులు సిద్దంగా ఉన్నారు.