బ్రిక్స్‌ తో తమకు ప్రమాదం అంటూ పశ్చిమ దేశాల ప్రచారం

BRICS is a danger to the western countries' propagandaప్రచ్చన్న యుద్ధం ముగిసి ముప్పై ఏండ్లు గడిచినా పశ్చిమ దేశాలు ఆ మానసిక స్థితి నుంచి బయటకు రాలేకపోతున్నాయి. అందుకే చైనా, రష్యాలు ప్రమాదకర దేశాలుగా వీటికి కనపడుతున్నాయి. మరోవిధంగా చెప్పాలంటే చైనా, రష్యాలు క్రియాశీలకంగావున్న బ్రిక్స్‌ విస్తరణను నాటో కూటమి దేశాలు ప్రమాదకరంగా భావిస్తున్నాయి.
2009లో బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనాలతో బ్రిక్స్‌ ఏర్పడింది. ఆ తరువాత రెండు సంవత్సరాలకు దక్షిణాఫ్రికా చేరింది. ఈ కలయికతో పశ్చిమ దేశాల మీడియాకు మంచిపని దొరికినట్టయింది. ఈ దేశాల మీడియాలో ‘నాటోకు సవాల్‌’, ఒక ‘నూతన ప్రపంచ క్రమం’, ‘పశ్చిమ దేశాల అస్తిత్వానికి పెను ప్రమాదం’ వంటి పతాక శీర్షికలు దర్శనమిస్తున్నాయి. తాజాగా జొహాన్నెస్‌ బర్గ్‌ లో గత వారం జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశం తరువాత ఇటువంటి శీర్షికలు మరిన్ని కనిపిస్తాయి.
ఇదో విచిత్ర పరిస్థితి. కానీ బ్రిక్స్‌ ‘పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకమైన దేశాల’ను ఐక్యం చేయటం లేదనేది కాదనలేని సత్యం. బ్రిక్స్‌ పేద దేశాల గ్రూపు కూడా కాదు. వ్యవస్థాపక ఐదు దేశాలలో రష్యా ఎప్పటినుంచో అభివృద్ధి చెదిన దేశంగా పరిగణింపబడుతోంది. ఈ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు మూడవ వంతు ఉన్నాయి. బ్రిక్స్‌ తో పశ్చిమ దేశాలకు ప్రమాదం అనే వాదనకు ఎటువంటి ఆధారమూ లేదు. అసలు బ్రిక్స్‌ ను నాటో కూటమితో పోల్చటమే సరియైనది కాదు. ఎందుకంటే బ్రిక్స్‌ గ్రూపుకు సమిష్టి సైనిక దళాలు లేవు. సమిష్టి సైనిక కార్యక్రమం కూడా లేదు. సంయుక్త సైనిక విన్యాసాలలో కూడా అన్ని దేశాలు పాల్గొనవు.
సభ్యదేశాల మధ్య సైనిక సహకారం బ్రిక్స్‌ పరిధిలోని అంశం కాదు. అలాగే సాయుధ సంఘర్షణలపట్ల దేశాల వైఖరి కూడా బ్రిక్స్‌ పరిధిలోని అంశం కాదనే వాస్తవాన్ని జొహాన్నెస్‌ బర్గ్‌ శిఖరాగ్ర సమావేశంలో జరిగిన చర్చలు తెలియజేశాయి. ఉదాహరణకు చైనా ప్రపంచ భద్రతకు సమిష్టి వైఖరి ఉండాలని ‘ప్రపంచ భద్రతకు చొరవ’ అనే విషయాన్ని ప్రతిపాదించింది. తాము ఏ కూటమిలోనూ భాగస్వాములం కాదని శిఖరాగ్ర సమావేశానికి ముందు దక్షిణ అమెరికా అధ్యక్షుడు, సిరిల్‌ రమాఫోసా ప్రకటించాడు. ఈ రెండు ప్రకటనలు నాటో కూటమి విస్తరణను, ప్రపంచ రాజకీయాలను ధ్రువీకరింపజేయటాన్ని(పోలరైజ్‌) వ్యతిరేకించేవని భావించే అవకాశం ఉంది. అలాగే ఉక్రెయిన్‌ లో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు షరతులులేని మద్దతును నిరాకరించేదని కూడా అనుకునే వీలుంది. సైనిక స్వభావంలేని బ్రిక్స్‌ లక్షణం ఘర్షణలపట్ల ఆసక్తిలేని దేశాలను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ప్రపంచ క్రమాన్ని(వరల్డ్‌ ఆర్డర్‌) నియంత్రించే విషయంలో కూడా బ్రిక్స్‌ గ్రూపుకు పెద్దగా ఆసక్తిలేదు. వర్తమాన ప్రపంచ క్రమాన్ని కూలదూసే ప్రతిపాదనేదీ బ్రిక్స్‌ ముందులేదు. ఐక్యరాజ్య సమితి, జీ-20 దేశాల పట్ల బ్రిక్స్‌ సానుకూలంగా వ్యవహరిస్తుంటుంది. బ్రిక్స్‌ సభ్య దేశాలు ఐక్యరాజ్య సమితి తీర్మానాలతోను, పేదరికంపైన పోరాటం చేసేందుకు ఉద్దేశింపబడిన జీ-20 ప్రణాళికలను, ప్రపంచ ఆర్థిక సమస్యల పరిష్కారం చేసేందుకు జీ-20 నాయకత్వాన్నిఆమోదిస్తుంటాయి. బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సిల్వా అన్నట్టు బ్రిక్స్‌ దేశాలు తమను తాము సమీకరించుకోవాలని అనుకుంటున్నాయి.
బ్రిక్స్‌ గ్రూపు ఆసక్తి, బలం దాని సభ్యదేశాల ఆర్థిక వ్యవస్థలో ఉంది. మిగిలిన రంగాలన్నింటికంటే ఈ రంగంలో బ్రిక్స్‌ మెరుపువేగంతో ముందుకు పోతోంది. ఇందుకు ఉదాహరణగా రెండు రంగాలను చెప్పుకోవచ్చు. ఒకటి: ద న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు. రెండవది: ద కాంటిన్జెంట్‌ రిజర్వ్‌ అరేంజ్‌మెంట్‌. 2015లో స్థాపించినన న్యూ డెవెలప్మెంట్‌ బ్యాంకు ప్రపంచ బ్యాంకుకు పోటీగా ఇన్ఫ్రా పోజక్టులకు పెద్ద మొత్తంలో అప్పులిస్తుంది. అయితే ఈ బ్యాంకును అప్పుడే ప్రపంచ బ్యాంకుతో పోల్చలేము. అయితే ఈ బ్యాంకు షరతులు చాలా ఉదారంగా ఉండటంవల్ల అప్పుల కోసం డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంది. బ్రిక్స్‌ సభ్యదేశాలు లిక్విడిటీ సంక్షోభంలోపడినప్పుడు ఆదుకోవటానికి కామన్‌ కరెన్సీల రిజర్వ్‌ తో కూడిన కాంటిన్జెంట్‌ రిజర్వ్‌ అరేరజ్‌మెంట్‌(సీఆర్‌ఏ) ఏర్పడింది. వాణిజ్యం సాఫీగా సాగటానికి, తీవ్ర సంక్షోభం ఏర్పడినప్పుడు ఆర్థిక అవసరాలను తీర్చటానికి అవకాశం కలిగేలా సీఆర్‌ఏని రూపొందించారు. ప్రపంచ ఆర్థికాభివ్రుద్ధికి అవరోధంగా పెట్టుబడులు అడుగంటినప్పుడు, కొన్ని సభ్యదేశాలపైన ఆంక్షలను విధించినప్పుడు ఇటువంటి రిజర్వ్‌ ఉపయోగకరంగా ఉంటుంది. ‘కరెన్సీ ఇన్సూరెన్స్‌’ కే కాకుండా యూరోవంటి బ్రిక్స్‌ కరెన్సీ ని స్రుష్టించటానికి కూడా సిఆర్‌ఏ సహాయపడుతుంది. ఇప్పటికే చైనా, రష్యా, ఇండియా సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(సీబీడీసీ)ని ప్రవేశపెట్టాయి. బ్రాజిల్‌, సౌత్‌ ఆఫ్రికాలు కూడా అందుకు సిద్దపడుతున్నాయి. అయితే ఇది అంత తేలికగా ఆచరణలోకి తీసుకునివచ్చే ప్రక్రియ కాదు. అన్నింటికంటే ముఖ్యంగా స్విఫ్ట్‌ లాగా స్వేచ్చగా చెల్లింపులు చేసే వ్యవస్థను రూపొందించుకునే తక్షణ లక్ష్యం బ్రిక్స్‌ ముందు ఉంది.
జొహాన్నెస్‌ బర్గ్‌ శిఖరాగ్ర సభలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో బ్రిక్స్‌ ను విస్తరించటం మఖ్యమైనది. అర్జంటీనా, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియాల కోరికమేరకు బ్రిక్స్‌ లో చేరటానికి ఆహ్వానించటం జరిగింది. 2024 జనవరి 1వ తేదీనుంచి ఈ దేశాలు అధికారికంగా బ్రిక్స్‌ లో చేరతాయి. ఈ దేశాలు చేరిన తరువాత ప్రపంచ జనాభాలో బ్రిక్స్‌ దేశాల జనాభా 45శాతం ఉంటుంది. గోధుమలు, వరి ప్రపంచ ఉత్పత్తిలో సగం, 17శాతం బంగారం నిల్వలు బ్రిక్స్‌ దేశాలలో ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రపంచ చమురు ఉత్పత్తిలో 80శాతం బ్రిక్స్‌ దేశాల నుంచే వస్తుంది. సౌదీ అరేబియా, రష్యా, ఇరాన్‌, యుఏఇ వంటి చమురును సరఫరాచేసే దేశాలు, చైనా, ఇండియావంటి చమురును పెద్ద ఎత్తున వినిమయం చేసే దేశాలు ఆయా దేశాల జాతీయ కరెన్సీలలో వాణిజ్యం జరుపుతుంటే డాలర్‌ ఆధిపత్యం పునాదులు కదులుతాయి. ప్రపంచంలోనే అత్యంతగా చమురును దిగుమతి చేసుకునే చైనా కరెన్సీ యువాన్‌ లో సెటిల్మెంట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో ‘నిర్‌ డాలరీకరణ(డీడాలరైజేషన్‌)’ జరగనప్పటికీ డాలర్‌ బలహీనపడుతుంది.ఇలా అంతర్జాతీయ రాజకీయాలలో బ్రిక్స్‌ ఒక ప్రజాస్వామిక ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తోంది. దీని ప్రభావం గణనీయంగా ఉంటుందనే పశ్చిమ దేశాలు భయపడుతున్నాయి. నయావలసవాద విధానాలకు కాలం చెల్లిందనే విషయాన్ని పశ్చిమ దేశాలకు బ్రిక్స్‌ ద్వారా చరిత్ర మరోసారి గుర్తు చేస్తోంది.

నెల్లూరు నరసింహారావు

Spread the love