నిబంధనలకు పాతర

As per the rules– ఈసీ లెక్కలోని రాని బీజేపీ ఫేస్‌బుక్‌ ప్రచార వ్యయం
– గుజరాత్‌ ఎన్నికల సమయంలో నరేంద్ర-భూపేంద్ర పేరిట పేజీ
న్యూఢిల్లీ : ఎన్నికలలో పోటీ చేసే పార్టీలు ఎలక్షన్‌ కమిషన్‌ కన్నుగప్పి, నిబంధనలకు పాతర వేస్తూ ఫేస్‌బుక్‌ పేజీలలో ప్రచారం చేసుకోవచ్చు. పనిలోపనిగా ప్రత్యర్థులపై బురద చల్లవచ్చు. ప్రచారానికి తెర పడిన తర్వాత కూడా దర్జాగా ప్రకటనలు ఇస్తూ ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. ఎలాగంటారా? 2000వ సంవత్సరం డిసెంబర్‌లో జరిగిన గుజరాత్‌ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఒకే ఐపీ అడ్రస్‌తో ఉన్న 23 వెబ్‌సైట్లు, వాటి అనుబంధ ఫేస్‌బుక్‌ పేజీలు ఫేస్‌బుక్‌లో చాపకింద నీరులా బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేశాయి. ప్రత్యర్థి పార్టీలు, వాటి నాయకుల మీద విషం చిమ్మాయి. ఈ పేజీలు లక్షలాది రూపాయలు కుమ్మరించి ప్రకటనలు ఇచ్చాయి. స్వతంత్ర ‘ఆల్ట్‌ న్యూస్‌’ మీడియా సంస్థ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ బండారాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది.
‘నరేంద్ర భూపేంద్ర’ పేరిట ఉన్న ఫేస్‌బుక్‌ పేజీపై ఆల్ట్‌ న్యూస్‌ కూపీ లాగింది. అయితే ఇప్పుడు ఆ పేజీని తొలగించారు. ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ పేరిట ఈ పేజీని రూపొందించారు. ఈ ఇరువురు నేతలకు అనుకూలంగా ఈ పేజీలో ప్రకటనలు గుప్పించారని మెటా యాడ్‌ లైబ్రరీ నివేదిక తెలిపింది. నరేంద్ర-భూపేంద్ర పేరిట ఉన్న ఈ పేజీ నేరుగా బీజేపీ అనుకూల వెబ్‌సైట్లతో అనుసంధానమై ఉంది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది. ఎందుకంటే ఈ పేజీలో ఇచ్చిన ప్రకటనలపై చేసిన కోట్లది రూపాయల ఖర్చు ఎన్నికల ప్రచార వ్యయంలో చేరలేదు. అంటే ఎన్నికల కమిషన్‌ కన్నుగప్పి ఈ తతంగాన్ని నడిపించారన్న మాట.
ఆ ఖర్చు ఎవరి ఖాతాలో వేశారు?
మెటా అనేది ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ. అది తన యాడ్‌ లైబ్రరీ నివేదికలో అనేక సంవత్సరాలుగా రాజకీయ ప్రచార ప్రకటనల సమాచారాన్ని నిక్షిప్తం చేస్తోంది. ఫేస్‌బుక్‌ నుండి తొలగించిన పేజీల సమాచారం కూడా ఇందులో ఉంటుంది. 2022 జూన్‌ 14 నుండి గుజరాత్‌ శాసనసభ ఎన్నికలు జరిగిన డిసెంబర్‌ వరకూ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ పేజీ 145 ప్రకటనలు ఇచ్చింది. వీటి కోసం అక్షరాలా రూ.55,53,940 ఖర్చు చేసింది. అయితే ఈ వ్యయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తేలేదు. ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఆదేశాల ప్రకారం గుజరాత్‌లో ఒక్కో శాసనసభ అభ్యర్థి రూ.40 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. భూపేంద్ర పటేల్‌ నవంబర్‌ 16న నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ రోజు నుండి డిసెంబర్‌ 8వ తేదీ వరకూ రాజకీయ ప్రచార ప్రకటనల కోసం నరేంద్ర-భూపేంద్ర ఫేస్‌బుక్‌ పేజీ రూ.31,47,600 నుండి రూ.38,62,694 ఖర్చు చేసింది. అయితే తన ఎన్నికల వ్యయం మొత్తం రూ.18,74,049 లక్షలు మాత్రమేనని భూపేంద్ర ప్రకటించారు. పైగా ఎన్నికల ప్రచార ప్రకటనల కోసం తాను కేవలం రూ.4,206 మాత్రమే ఖర్చు చేశానని తెలిపారు. మరి ఫేస్‌బుక్‌ పేజీ పెట్టిన ఖర్చు ఎవరి ఖాతాలో వేశారు?
పోలింగ్‌ రోజు కూడా ప్రచారం
ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేమంటే ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్‌ రోజు వరకూ అభ్యర్థులు ఏ రూపంలో కూడా ప్రచారం చేయకూడదు. కానీ నరేంద్ర-భూపేంద్ర పేజీలో మాత్రం ఎన్నికల రోజు కూడా బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు వచ్చాయి. భూపేంద్ర పోటీ చేసిన ఘట్లోడియా స్థానంలో డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరిగింది. ఆ రోజున బీజేపీ ప్రభుత్వ విజయాలను ప్రస్తుతిస్తూ, భూపేంద్ర-నరేంద్ర ఫొటోలతో సహా ప్రకటనలు వచ్చాయి. ఈ పేజీని అన్ని బీజేపీ అనుకూల వెబ్‌సైట్లతో అనుసంధానం చేశారు. వీటన్నింటి ఐపీ అడ్రస్‌లు ఒకటే. అయితే తనకు బీజేపీతో సంబంధం ఉన్న విషయాన్ని మాత్రం నరేంద్ర-భూపేంద్ర పేజీలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ సంవత్సరం మేలో ఓ వెబ్‌సైట్‌ ఐపీ అడ్రస్‌ను మార్చారు.

Spread the love