బుద్ధదేవ్‌ భట్టాచార్యకు తీవ్ర అస్వస్థత

– గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా ఆస్పత్రికి తరలింపు
కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు బుద్ధదేవ్‌ భట్టాచార్య (79) శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను నగరంలోని ఉడ్‌ల్యాండ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బుద్ధదేవ్‌ కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఊపిరాడేందుకు నెబ్యులైజర్‌ వినియోగిస్తున్నారు. శనివారం ఉదయం బుద్ధదేవ్‌ను పరీక్షించిన వైద్యులు నెబ్యులైజర్‌ ఉపయోగించినా..ఊపిరి ఆడటం కష్టమవుతోందని గుర్తించి తక్షణమే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి ఆయనను సమీపంలోని ఉడ్‌ల్యాండ్స్‌ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో బుద్ధదేవ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆక్సిజన్‌ స్థాయిలు 70శాతం మేర పడిపోయాయని వైద్యులు తెలిపారు. క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వెంటిలేటర్‌పై వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని ఉడ్‌ల్యాండ్స్‌ ఆస్పత్రి ఎండీ, సీఈఓ డాక్టర్‌ రూపాలి బసు శనివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. బుద్ధదేవ్‌ ఆరోగ్య పరిస్థితిని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం, ఇతర నాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భట్టాచార్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉడ్‌ల్యాండ్స్‌ విడుదల చేసిన బులిటెన్‌ను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. కార్డియాలజిస్టులు, పల్మొనాలజిస్టుల పర్యవేక్షణలో భట్టాచార్యకు వైద్యం కొనసాగుతోందని తెలిపారు. కాగా రాష్ట్ర గవర్నరు ఆనంద్‌ బసు ఆస్పత్రికి వెళ్లి బుద్ధదేవ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా బుద్ధదేవ్‌ ఆరోగ్యస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.

Spread the love