– పునరాలోచనలో ఎమ్మెల్యేలు మైనంపల్లి, భేతి
– ‘భవిష్యత్ కార్యాచరణ’ పేరుతో అధిష్టానానికి మెలిక
– ఇంకా ఎదురు చూసే యోచనలో మరో ఇద్దరు నేతలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అసంతృప్తి తక్కువగా ఉందనుకునే సమయంలో ఒక్కొక్కరుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాత్రమే అసహనం వ్యక్తం చేయగా.. ఇప్పుడు ఆయనకు మరో ఎమ్మెల్యే తోడయ్యారు. ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి కూడా ధిక్కార స్వరం అందుకున్నారు. ఒకరికి టికెట్ ఇచ్చినా.. ఇంకో టికెట్ కోసం అసంతృప్తి చెందుతుంటే.. మరొకరు అసలు టికెట్ ఎందుకు కేటాయించలేదని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వారి పరిస్థితి ‘ఉండలేక.. వెళ్లలేక..’ అన్నట్టుగా తయారైంది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. మేడ్చల్ నుంచి మంత్రి మల్లారెడ్డ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, కూకట్‌పల్లి నుంచి మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ నుంచి కేపీ వివేకాంద, మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు, ఉప్పల్ నుంచి భేతి సుభాష్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఈ టికెట్ల కేటాయింపులో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం దక్కింది. ఉప్పల్ అభ్యర్థిని మాత్రమే మార్చారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న భేతి సుభాష్‌రెడ్డిని కాదని బండారి లక్ష్మారెడ్డికి అవకాశం కల్పించారు. దాంతో ఆయన తాజాగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందే.. మైనంపల్లికి టికెట్ కేటాయించినా.. ఆయన కొడుక్కి మెదక్ టికెట్ ఇవ్వనందున మంత్రి హరీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోపాటు వారం రోజుల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఇలా ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడంతో అంసతృప్తులు బయటకు వస్తున్నారు. ఒక్కొక్కరుగా వారి ఆవేదనను కార్యకర్తలు, పార్టీ అధిష్టానం మందు ఉంచుతున్నారు. ఒక పక్క టికెట్ రాని ఆశావాహులు కలిసి పని చేసుకోవాలని అధిష్టానం సూచిస్తుంటే.. మరోపక్క పార్టీలో కొనసాగాలా..? తమ దారి తాము చూసుకోవాలా..? అని సిట్టింగ్ ఎమ్మెల్యేలు మైనంపల్లి, భేతి తర్జనభర్జన పడుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఈ ఇద్దరు నేతల్లో అంతర్మథనం మొదలైంది. వారి పొలిటికల్ ఫ్యూచర్‌పై డైలమాలో ఉన్నారు. గులాబీ పార్టీలో ఉండలేక.. మరో పార్టీలోకి వెళ్లలేక.. సతమతమవుతున్నారు. పార్టీ కోసం పని చేసినా టికెట్లు దక్కలేదని వారి ఆవేదన వెళ్లగక్కుతున్నారు.
భవిష్యత్ కార్యాచరణతో మెళిక..
కొడుక్కి టికెట్ ఇవ్వలేదని మైనంపల్లి హనుమంతరావు, తనకు మళ్లీ అవకాశం ఇవ్వలేదని ఆవేదనతో ఉన్న భేతి సుభాష్‌రెడ్డి పునరాలోచనలో పడ్డారు. మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకించిన మైనంపల్లి అధిష్టానంలోని ఓ పెద్ద నాయకుడి నుంచి ఫోన్ రాగానే కాస్త తగ్గారు. వారం, పది రోజుల తర్వాత మెదక్, మల్కాజిగిరిలో పర్యటించి కార్యకర్తలు, అనుచరులను కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న భేతి, మంగళవారం తెరపైకి వచ్చారు. కార్యకర్తలు, అనుచరులతో తన నివాసంలో సమావేశమై పార్టీ అధిష్టానంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డిపై కూడా ఘాటు విమర్శలు చేశారు. అధిష్టానం పునరాలోచన చేయకుంటే వారం, పది రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఈయన కూడా చెప్పడం చర్చనీయాంశమైంది. నిజంగానే కార్యాచరణ ప్రకటిస్తారా..? లేక అధిష్టానం ఓ మెట్టు దిగొచ్చి టికెట్లు కేటాయిస్తుందని ఇలా చేస్తున్నారా..? అని ప్రజల్లో సందేహం మొదలైంది. భవిష్యత్ కార్యాచరణ పేరుతో పార్టీ అధిష్టానాన్ని భయపెడుతున్నారనే టాక్ కూడా జోరుగా వినిపిస్తోంది. కొంత మంది అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలూ ఒకేలా ప్రకటన చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకరిని చూసి ఒకరు ఇలా ప్రకటించారా..? లేక ఇద్దరూ కావాలనే అన్నారా..? లేక ఎవరి దారిన వారు మాట్లాడారా..? అనే చర్చ సాగుతోంది. భవిష్యత్ కార్యాచరణ పేరుతో మెలిక పెడితే.. అధిష్టానం దిగొచ్చి, పునరాలోచించి తమకు సీట్లు కేటాయిస్తుందనే ప్లాన్ వేసినట్టు కూడా మరోవైపు గుసగుసలు వినపడుతున్నాయి. వారం, పది రోజుల డెడ్ లైన్ పెడితే ఈ లోపు అధిష్టానం పునరాలోచింది తమను పిలిచి మాట్లాడుతుందని ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.