ఎంపీ అవినాష్‌ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు

నవతెలంగాణ – హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్‌ ద్వారా సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డికి నోటీసులు పంపారు. ఇప్పటికే రెండుసార్లు సీబీఐ విచారణకు అవినాష్‌ రెడ్డి గైర్హాజరయ్యారు. వివేకా హత్య కేసులో వైఎస్‌ అవినాష్‌ రెడ్డి శుక్రవారం సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. నిన్న రోజంతా నెలకొన్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన విచాణరకు హాజరుకాలేదు. చివరి నిముషంలో తన తల్లి శ్రీలక్ష్మి (లక్ష్మమ్మ) ఆరోగ్యం బాగాలేదంటూ పులివెందుల వెళ్లిపోవడం, సీబీఐ అధికారులు ఆయనను కొంతదూరం అనుసరించడం వంటి పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈలోపు అవినాష్‌ న్యాయవాదులు సీబీఐ కార్యాలయానికి చేరుకొని ఈ విషయం చెప్పి, విచారణకు హాజరయ్యేందుకు మరో తేదీ ఇవ్వాలని కోరారు. అవినాష్‌ అరెస్టు తప్పదని భావిస్తున్న తరుణంలో చివరి నిముషంలో చోటుచేసుకున్న ఈ నాటకీయ పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపాయి.

Spread the love