కేంద్రం తీరు సరికాదు

కేంద్రం ఢిల్లీ సర్వీసులపై అడ్డదారుల్లో పెత్తనం చలాయిస్తున్నది. అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కాదని అధికారాన్ని తన చేతులోకి తీసుకుంటున్నది. కేంద్రం తీరును భారత సర్వోన్నత న్యాయస్థానం సైతం తప్పుబట్టింది. శాంతిభద్రతలు మినహా మిగతా అధికారాలను ఢిల్లీ ప్రభుత్వానికి కట్టబెట్టాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పును సైతం లెక్క చేయకుండా ఒక్క ఆర్డినెన్సుతో ఢిల్లీ సర్వీసులను కేంద్రం తన చేతుల్లోకి తెచ్చుకున్నది. అయితే, మోడీ సర్కారు తీరును నిపుణులు, విశ్లేషకులు, మేధావులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
– ‘ఢిల్లీ ఆర్డినెన్సు’ పార్లమెంటరీ ఫెడరలిజం స్ఫూర్తిని ఉల్లంఘిస్తుంది
– సమాఖ్య ప్రజాస్వామ్య లక్షణం ‘అధికార విభజన’
– అధికారమనేది ఎన్నుకోబడినవారికే ఉంటుంది
– రాష్ట్రపతి, గవర్నర్లు, ఎల్జీలు వంటి నామమాత్రపు అధిపతులకు కాదు
– రాజకీయ విశ్లేషకులు, నిపుణులు
న్యూఢిల్లీ : ఢిల్లీ సర్వీసుల విషయంలో మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు విమర్శపాలవుతున్నది. ఢిల్లీలో సేవల విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి శాసన, కార్యనిర్వాహక అధికారాలను పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం విదితమే. అయితే, కేంద్రంలోని మోడీ సర్కారు మాత్రం ఢిల్లీ సర్వీసులపై పట్టు నిలుపుకునేందుకు ప్రత్యేకించి ఏకంగా ఒక ఆర్డినెన్సునే తీసుకొచ్చింది. అయితే, ఈ ఆర్దినెన్సు నిర్ణయం సరికాదని దేశంలోని విశ్లేషకులు, మేధావులు విమర్శిస్తున్నారు.
మోడీ సర్కారు తీరు పార్లమెంటరీ ఫెడరలిజం స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నదని ఆరోపించారు. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన ఉంటుందనీ, కేంద్రం దానిని గౌరవించకుండా నియంతృత్వ ధోరణిలో ముందుకెళ్తున్నదని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక ప్రభుత్వాలకే అధికారం చలాయించే అర్హత ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రపతి, గవర్నర్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ)లు వంటి రాజ్యాంగ పదవులను అనుభవించే వ్యక్తులకు ఈ అధికారం ఉండదని స్పష్టం చేశారు. అయితే, ఢిల్లీ విషయంలో మోడీ ప్రభుత్వం అక్కడి ఎల్జీని ఉపయోగించుకుంటూ పెత్తనం చలాయించాలని చూస్తున్నదని చెప్పారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 239 కేంద్ర పాలిత ప్రాంతాలను (యూటీ) నియంత్రించే నిబంధన గురించి చెబుతుందని గుర్తు చేశారు. అయితే ఢిల్లీ మిగతా యూటీల కంటే భిన్నమైనదనీ, ఇది పూర్తి కేంద్రపాలిత ప్రాంతం కాదని చెప్పారు. అయితే, ఆర్టికల్‌ 239ఏఏ(3)(ఏ) ప్రకారం.. పోలీసు, శాంతిభద్రతలు, భూమి వంటి మూడు అంశాలు ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో ఉండవన్నారు. ఈ మూడింటి మినహా మిగతా అధికారాలు ఢిల్లీలో ఎన్నిక కాబడిన ప్రభుత్వానికి ఉంటుందని నిపుణులు, విశ్లేషకులు తెలిపారు. ఆర్టికల్‌ 239ఏఏ(4) ప్రకారం ‘సేవలు'(ఉదాహరణకు బ్యూరోక్రాట్‌ల నియామకాలు, బదిలీలు) రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక హక్కు అనీ, ముఖ్యమంత్రి సహాయం, సలహాతో తప్పక జరగాలని తెలిపారు. కేంద్రంలోని మోడీ సర్కారు ఈ విషయాన్ని తోసిపుచ్చుతూ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఈ విషయంలో కేంద్రం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని ఖూనీ చేస్తున్నదనీ, వెంటనే ఆర్డినెన్సును వెనక్కి తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని మేధావులు, రాజకీయ విశ్లేషకులు సూచించారు. లేకపోతే ఇది ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలిగిస్తుందని హెచ్చరించారు. కేంద్ర ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా అక్కడి ఆప్‌ ప్రభుత్వం రాజకీయంగా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలను కలుస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని వారికి వివరిస్తున్నారు. ఇప్పటికే ఆయన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ లను కలిశారు. వీరంతా ఢిల్లీ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ ఆప్‌ పోరాటానికి మద్దతు తెలిపిన విషయం విదితమే.

Spread the love