నవతెలంగాణ – న్యూఢిల్లీ: దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కీలక నిబంధనలు జారీ చేసింది. దగ్గు సిరప్‌లకు ప్రభుత్వ ల్యాబ్‌ల్లో అనుమతి తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ల్యాబ్‌ల్లో తనిఖీ తర్వాతే ఎగుమతులకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి దగ్గు మందు ఎగుమతులపై నిబంధనలు వర్తించనున్నారు. భారత్‌కు చెందిన పలు ఫార్మా కంపెనీలు ఎగుమతి చేస్తున్న దగ్గు సిరప్‌ల నాణ్యతపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు తలెత్తిన తర్వాత కేంద్రం ఈ నిబంధనలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ల్యాబ్స్ దగ్గు సిరప్‌లను పరీక్షించిన తర్వాత.. తప్పనిసరిగా ఓ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తాయి. ఆ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అధికారులకు చూపించాలని నిబంధన విధించింది. ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్, ఆర్‌డీటీఎల్ – చండీఘర్, సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్ – కోల్‌కతా, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ – చెన్నై, హైదరాబాద్, ముంబై, ఆర్‌డీటీఎల్ – గువహటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన ఎన్ఏబీఎల్ వంటి ల్యాబ్‌ల్లో దగ్గు సిరప్‌లను పరీక్షించేందుకు అవకాశం కల్పించారు.