చెరువు శిఖం భూమి అన్యాక్రాంతం

– కబ్జాకు గురవుతున్న చెరువు కట్ట
– కోట్లు విలువ చేసే భూమిపై కన్నేసిన ఓ నాయకుడు
– పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు
– ఆందోళనలో చెరువు కింద ఉన్న రైతులు
నవతెలంగాణ-తాండూరు
భూములకు రెక్కలు రావడంతో దొరికిందే అదునుగా చెరువు కట్టపై కన్నేసిన అక్రమార్కులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చెరువు కట్టను సైతం తొవ్వేశారు. భూముల ధరలు కోట్లకు రూపాయలకు ఎగబాకడంతో ఆడింది ఆట పాడింది పాట అన్న చందంగా ఓ నాయకుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చెరువు కట్టను తొలగించి కబ్జాకు తెర లేపారు. తాండూరు నియోజకవర్గంలోని పెద్దముల్‌ మండలం జనగాం గ్రామ సమీపంలో ఎన్నో సంవత్సరాలుగా నాగిరెడ్డి కుంట ఉంది. గతంలో నిజం సర్కారులో ఆ కుంట కింద వందల ఎకరాలు నీరు పారేందుకు అప్పటి అధికారులు చెరువుకు కట్టను నిర్మించి తూములు కూడా ఏర్పాటు చేశారు. గతంలో చెరువు కట్టను తొలగించేందుకు ప్రయత్నించినా వారిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని రైతులు అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎవరు పట్టించుకోకపోవడంతో చెరువు పక్కనే ఉన్న పట్టాదారు చెరువు శిఖం భూమిపై కన్నేసి చెరువు కట్టను సైతం తొవ్వేశారు. చెరువు కట్టను తొవ్వేసి తన పొలంలో కలుపుకున్నారు. గ్రామంలో ఆ నాయకునికి మంచి పలుకుబడి ఉండడంతో ఎవరు రైతులు అతనిపై ఫిర్యాదు చేసే ధైర్యం చేయడం లేదు. చెరువు కట్టను తొవ్వుతున్న అటు వైపు వెళ్లేందుకు సైతం రైతులు భయపడుతున్నారు. గ్రామంలోని సన్న చిన్న కారు రైతులు ఈ చెరువు నిండితేనే పంటలు సాగు చేసుకుంటారు. ఈ చెరువుతోనే తూముల ద్వారా తమ పొలాలకు నీళ్లు వచ్చేవని రైతులంటున్నారు. ఈ చెరువు ఉంటేనే బోర్లలో నీరు ఉంటుందని ప్రస్తుతం చెరువు తూములు గండిపడడంతో నీళ్లు నిలువ ఉండకపోవడంతో బోర్లలో నీరు కూడా సరిగా ఉండడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్టను తొవ్వేస్తూ చెరువు పూర్తిగా అన్యక్రాంతమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. చెరువు కట్టను తొవ్విన వారిపై నేటికీ ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెరువు కట్టను తొలగించిన వారిపై చర్యలు తీసుకొని చెరువును కాపాడి రైతులకు న్యాయం చేయాలని పలువురు వేడుకుంటున్నారు.
చెరువు కట్టను తొవ్విన వారిపై చర్యలు తీసుకుంటాం
చెరువు కట్టను తొవ్విన వారిపై చర్యలు తీసుకుంటాం. ఇరిగేషన్‌ శాఖ అధికారులతో పూర్తి సమాచారం తీసుకొని చర్యలు తీసుకోవాలని మండల తహసీల్దార్‌కు ఆదేశాలు ఇచ్చాం. త్వరలో చర్యలు తీసుకుంటాం. చెరువులు కబ్జాలకు గురైతే ఊరుకునేది లేదు. ఎంతటి వారు అయినా చర్యలు తీసుకుంటాం.
– తాండూరు ఆర్డీవో శ్రీనివాసరావు

Spread the love