మూసి కాలుష్య రాకాసి

– అనారోగ్యం పాలవుతున్న ప్రజలు
– తాగే నీరు, తినే ఆహారం అంతా విషతుల్యం
నవతెలంగాణ-భువనగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి జీవనాడిగా ఉన్న మూసి నది నేడు అత్యంత విష కాలుష్య రసాయనాల కేంద్రంగా మారింది. వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టిన ఈ మూసి( ముంచుకుందా) నది కాలుష్య కోరల్ల చిక్కుకుంది.  మూసీ నది కృష్ణా నదికి ఉపనది.మన రాష్ట్రంలోనే పుట్టి మన రాష్ట్రంలోనే పారుతూ ప్రవహించే ఏకైక ముగిసే నది .హైదరాబాద్ పరిశ్రమల నుండి విడుదలవుతున్న విష రసాయనాలు, వ్యర్ధాలు మూసిని కలుషితం చేస్తున్నాయి.  మూసి కాలుష్య ప్రభావం మనుషులపైనే కాదు, మూగజీవాలు, పక్షులు, జలాచరాలపై ప్రభావం చూపుతున్నాయి.  సాగునీరు కోసం త్రాగునీరు కోసం మూసి పరిహాక ప్రాంతంలో బోర్లు వేస్తే కలుషితమైన నీరే బయటకు వస్తుంది.
రసాయన వ్యర్థాలతో ప్రవహిస్తున్న మూసి, త్రాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి సైతం విషతుల్యం అనేక వ్యాధులతో ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆసుపత్రుల పాలవుతున్నారు.  గర్భకోశ వ్యాధులకు చర్మవ్యాధులకు గురవుతున్నారు ప్రజలపైనే కాదు, పక్షులు, మత్స్య సంపద  వృక్ష సంపద పైన ప్రభావం చూపుతూనే ఉన్నాయి.
మూసీ నది నాడు అద్భుతం
నేడు ప్రజలకు శాపం
ఒకప్పుడు మూసి అద్భుతమైన త్రాగునీరు అందించే నది. ఆ నీటిలో అడుగుభాగం కూడా కనబడేంత స్వచ్ఛత ఉండేది. నేడు ఆ నది మురికి కోపంగా మారింది.  మూసిలో మునిగితే వ్యాధులన్నీ పోతాయి అని నమ్మేవారు. నేడు  మూసిలో మునిగితే సర్వరోగాలు వస్తాయని మానవమనగడకే ప్రమాదమని పేర్కొంటున్నారు.  మూసి ప్రక్షాళన అనేది నీటి మీద రాతలు గానే మారాయి.  మూసి నీటిలో శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించగా భారలోహాలను గుర్తించారు. ఈ నీటి ద్వారా పండే పంటలు, పెరిగే చాపలు, పారే కల్లు,  వీచే గాలి కూడా విషతుల్యమే అని  పేర్కొంటున్నారు.
పట్నం బాటన ప్రజలు
ఇక్కడి ప్రజలు ఉన్న ఎకరం, అర ఎకరం భూమి విక్రయించి బతుకుదెరువుకోసం పట్నం బాటపడుతున్నారు. మూసీ కాలుష్య కోరల నుంచి విముక్తి కోసం దశాబ్దాలుగా పరివాహక ప్రజలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రతీ ఎన్నికల్లో మూసీ ప్రక్షాళన ప్రధాన ఎజెండాగా ఉంటున్నా, కార్యాచరణ లేక కాలుష్య పీడ మాత్రం ఈ ప్రాంతాన్ని వీడటం లేదు.  ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్న కాలుష్య కాలువను చూసి వారు ఏ విధంగా అయితే పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారో అలానే మూసిని కూడా ప్రక్షాళన చేసి పర్యాటక ప్రాంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు .
మూసి పుట్టుక. ..
మూసినది రాష్ట్రంలోని వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని అనంతగిరి కొండల నుంచి హైదరాబాద్ మీదుగా మేడ్చల్ యాదాద్రి నల్లగొండ సూర్యాపేట జిల్లాలో ప్రవహిస్తుంది. ఉమ్మడి జిల్లాలో భూదాన్ పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ, రామన్నపేట, కట్టంగూర్, శాలిగౌరారం, నకిరేకల్, కేతపల్లి, మాడుగులపల్లి, వేములపల్లి మిర్యాలగూడ, సూర్యాపేట, పెన్  పహాడ్ మండలాల మీదిగా సుమారు 1080 కిలోమీటర్లు పైగా ప్రయాణిస్తుంది. వాడపల్లి సంగమం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. దీనిపై 15 ఆనకట్టలు 200 పైగా పరిహాక గ్రామాల్లో 60 పైగా చెరువులు ఆధారపడి ఉన్నాయి. సుమారు 1.50లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నిత్యం 650 మిలియన్‌ గ్యాలన్ల వ్యర్థాలు మూసీలో కలుస్తున్నాయి. సుమారు 8లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మూసీనది ప్రక్షాళన అంశం తెరపైకి రాగా, పోటీచేసిన ఇద్దరు నేతలు కేంద్రం నుంచి నిధులు తెస్తామని ప్రజలకు హామీ ఇవ్వగా, అది అడియాసగానే మిగిలింది.
నామా మాత్రం ఎం.ఆర్.డి.సి ఏర్పాటు
మూసీ నది ప్రక్షాళనకు టీఆర్ఎస్‌ ప్రభుత్వం 2017లో మూసీ రివరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఎంఆర్‌డీసీ)ను ఏర్పాటు చేసింది. దీని ప్రత్యక్ష పర్యవేక్షణకు ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ను చైర్మన్‌గా నియమించింది. రూ.930కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి 2018 మార్చి నాటికి ప్రక్షాళన పూర్తిచేయాలన్నది లక్ష్యం. అందుకు రూ.22,784 కోట్లు అవసరమవుతాయని అప్పట్లో అధికారులు అంచనా వేశారు. మరోవైపు గతంలో బీజేపీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేసిన వెంకయ్యనాయుడు సైతం మూసీ ప్రక్షాళన విషయంలో హామీ ఇచ్చా రు.  మూడేళ్ల కిందట మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ఎంఆర్‌డీఏ)ని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్‌గా ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని నియమించింది. రూ.3000కోట్లు విడుదల చేస్తామని నాడు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఇప్పటి వరకు కేవలం రూ.312కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అది కూడా అధ్యయనం, ప్రతిపాదనలకే. 2017-18 బడ్జెట్‌లో రూ.377.35కోట్లు కేటాయించగా, రూ.32 లక్షలు, ఆ తర్వాత ఏడాది రూ.377కోట్లను కేటాయించగా, రూ.2.80 కోట్లు ఖర్చు చేశారు. ఇది జీతభత్యాలు, చిన్నచిన్న పనులకే కేటాయించారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రూ.754కోట్లు కేటాయించగా, కేవలం రూ.3.12కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. ప్రక్షాళన మాత్రం ఒక్క అడుగు ముందుపడలేదు.
కన్నీరు కారుస్తున్న రైతులు
మూసీ కలుషిత నీటితో పంటలు పండకపోవడంతో రైతులు పెట్టుబడులు పెట్టి నష్టపోయి రైతులు కన్నీరు కారుస్తున్నారు. గతంలో కూరగాయలు ఎక్కువ సాగుచేయగా, దిగుబడులు రాకపోవడంతో రైతులు సాగును మానేశారు. భూగర్భజలాలు తాగేందుకు వీలులేక ఆర్‌వో ప్లాంట్లే దిక్కయ్యాయి. ఒక్కో గ్రామంలో రెండు వరకు ఆర్‌వో ప్లాంట్లు ఉన్నాయి. ఇక్కడ మేతమేసిన పాడి పశువుల పాలు కూడా ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి. ఇక్కడి ప్రజలు ఎక్కువగా కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులతోపాటు గర్భకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్టు వైద్య నిపుణులు నిర్ధారించారు. తాటి చెట్లు కల్లు కూడా కలుషితమవుతుండటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. మూసీ పరివాహకంలోని 55 చెరువుల్లో చేపల పెంపకం జరుగుతుంది. ఈ వృత్తిపై 3,700 మత్స్యకార కుటుంబాలు ఆధారపడ్డాయి. కలుషిత జలాల్లో చేపలు చనిపోయి మత్స్యకారులు నష్టపోతున్నారు. చేనేత వస్త్రాలపై నీటితో రంగులు అద్దితే వెలిసిపోతుండటంతో వస్త్రాలకు డిమాండ్‌ లేకుండా పోతుందని చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  గత పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం ఎంపీగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికైన సందర్భంగా మాట్లాడుతూ మూసి ప్రక్షాళనకు నిధులు కేటాయించే విధంగా కృషిచేసి రక్షణ చేయిస్తానని ఈ ప్రాంత రుణం తీర్చుకుంటానని ఇచ్చిన హామీ  హామీగానే మిగిలిపోయింది.
మరో ఉద్యమం చేస్తాం : ఎండి జహంగీర్
మూసి పరీక్షల కోసం అనేక పోరాటాలు చేశామని మరో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి ఎండి జహంగీర్ తెలిపారు.
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మూసి ప్రక్షాళన మూసి కత్వాల నిర్మాణంతోపాటు, మూసి పై ఆధారపడ్డ పిలాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని, ఆసిఫ్ నగర్ కాలువలు పూర్తి చేయాలని అనేక పోరాటాలు నిర్వహించామన్నారు. తమ పోరాటాల ఫలితంగా  పిలాయిపల్లి, ధర్మారెడ్డి, బునాది గాని కాలువల పనులు ప్రారంభమైన పూర్తి చేయడంలో పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు.
మూసి ప్రక్షాళన కోసం  యాదాద్రి భువనగిరి నూతన జిల్లా ఏర్పడ్డ తర్వాత మూసి పరిహక ప్రాంత గ్రామాలలో చైతన్య యాత్ర నిర్వహించామని సీపీఐ(ఎం) పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ తెలిపారు. మూసి ప్రక్షాళనతో పాటు గోదావరి జలాలను మూసికి తరలించాలని కోరారు.
Spread the love