ఈ నెల 27 నుండి సీఎం జగన్ బస్సు యాత్ర..

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం శంఖారావాన్ని పూరించడానికి సిద్ధం అయింది. అందుకోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు నాలుగో దశలో మే 13 న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచార జోరును పెంచాయి. అయితే ఎన్నికల తేదీ ఆలస్యమవడం తో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ నెల 27 నుంచి దాదాపు 21 రోజుల పాటు ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుందని, 25 సభలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా.. ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Spread the love