ఇప్పటికే రూ.వెయ్యి కొట్ల కేటాయింపు.. నేడు సీఎం నాన్ నెట్ ఫెలోషిప్స్
సింగరేణి సహకారంతో
143 మంది పరిశోధకులకు
ఆర్థిక చేయూత
నెలకు రూ.5 వేల చొప్పున 3 ఏండ్లు ఫెలోషిప్స్
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఓయూ పూర్వ వైభవం కోసం రూ.1000 కోట్ల నిధులు ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు పరిశోధనలపై ఆసక్తి ఉన్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు “సీఎం నాన్-నెట్ ఫెలోషిప్స్” ద్వారా చేయూత అందించడానికి ఏర్పాట్లు చేసింది. ఓయూలోని 12 డీన్స్ పరిధిలో పరిశోధనలు చేస్తున్న కేటగిరీ-2 పీహెచ్‌డీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నాన్-నెట్ ఫెలోషిప్ పథకాన్ని ఓయూ వీసీ ప్రొ.కుమార్ ప్రారంభించారు. అర్హత సాధించిన 143 మంది పరిశోధక విద్యార్థులకు నెలకు రూ.5 వేల చొప్పున మూడు ఏండ్ల పాటు ఉపకార వేతనాలు అందించే ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సింగరేణి కాలరీస్ లిమిటెడ్.. ముఖ్యమంత్రి పేరుతో ఫెలోషిప్స్ అందించేందుకు రూ.కోటి విరాళం అందజేసింది. సుమారు 200 మంది పరిశోధక విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చిత్తశుద్ధి, క్రమశిక్షణతో పరిశోధనలు పూర్తి చేయాలని, ఓయూ విద్యార్థులు అంతర్జాతీయ గుర్తింపు కలిగిన పరిశోధనా పత్రాలను ప్రచురించాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఓయూ అధికారులు ఆకాంక్షిస్తున్నారు.
అదనపు కంటింజెన్సీ నిధులు
సామాజిక శాస్త్రాల్లో పరిశోధనలు చేస్తున్న విద్యార్థుల కు ఉపకార వేతనాలకు అదనంగా ఏటా రూ.6 వేల చొప్పున, సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాల పరిశోధ నలకు రూ.8 వేల చొప్పున కంటింజెన్సీ నిధులు అందిం చనున్న ట్టు ఓయూ వీసీ తెలిపారు. ఈ పథకాల కోసం ఏటా మొత్తం రూ.1.32 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. అవకాశాన్ని విద్యార్థులంతా సద్వినియోగించుకోవాలని సూచించారు.
వీసీ చొరవతోనే సాధ్యమైంది
రిజిస్ట్రార్ ప్రొ.నరేష్ రెడ్డి
సీఎం నాన్-నెట్ ఫెలోషిప్స్ పొందే విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ఓయూ రిజిస్ట్రార్ ప్రొ. నరేష్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలలకు ఒకసారి పరిశోధన పురోగతి నివేదిక సమర్పించాలని సూచించారు. ఇతర ఫెలోషిప్స్ పొందుతున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులని, పరిశోధనతోపాటు కనీసం రెండు పబ్లికేషన్స్ ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో నాన్-నెట్ ఫెలోషిప్స్ అందిస్తున్న తొలి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీనే అని రిజిస్ట్రార్ తెలిపారు. 2025లో అర్హులైన ప్రతి విద్యార్థికీ ఫెలోషిప్స్ అందించామరని చెప్పారు. త్వరలోనే పీహెచ్‌డీ కేటగిరీ-2 నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఇటీవల కేటగిరీ-1లో 366 ఖాళీలకు పీహెచ్‌డీ నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలిపారు. ప్రతి విద్యా సంవత్సరం పీహెచ్‌డీ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఓయూ వీసీ ప్రొ. కుమార్ ప్రత్యేక చొరవతోనే ఇవ్వన్నీ సాధ్యం అవుతున్నట్టు చెప్పారు.



