నిబంధనల మేరకే పదోన్నతులు ఉండాలంటూ
పలువురి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అకడమిక్ పోస్టుల్లో నాన్-అకడమిక్ అధికారుల నియామకాలపై వివాదం కొనసాగుతుంది. ఇటీవల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలోని ప్రిన్సిపాళ్లు, డీసీఓలు, ఆర్సీఓలతో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిర్వహించిన జూమ్ సమావేశంలో పలు పరిపాలనా, విద్యా, సంస్థాగత అంశాలతో పాటు ప్రమోషన్ల విషయమై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ సందర్భంగా మంత్రి, ఉన్నతాధికారులు, ప్రమోషన్లు పూర్తిగా రూల్స్ పరిధిలోనే జరుగుతాయనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు ఇవ్వబోమని భరోసా ఇచ్చినట్టు సమాచారం. అయితే, సంస్థలో ఇప్పటికే జరిగిన కొన్ని ప్రమోషన్లపై ప్రిన్సిపాళ్ల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సంస్థ హెడ్ ఆఫీస్‌లో నాన్-అకడమిక్ విభాగంలో పనిచేసిన ఒక అధికారి, అకడమిక్ సేవలకు సంబంధించిన అర్హతలతో పాటు ప్రిన్సిపాల్ లేదా లెక్చరర్‌గా సరిపడా అనుభవం లేకపోయినా, ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయి నుంచి నేరుగా డిప్యూటీ సెక్రటరీ (అకడమిక్) పదవికి ప్రమోషన్ పొందినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో సంస్థలో పరిపాలనా స్థిరత్వం లేకపోవడాన్ని ఉపయోగించుకుని ప్రమోషన్ రూల్స్‌ను పక్కన పెట్టి ఈ పదోన్నతి జరిగిందని పలువురు పేర్కొంటున్నారు.
ఇప్పుడు అదే తరహాలో హెడ్ ఆఫీస్‌లో నాన్-అకడమిక్ విభాగంలో పని చేస్తున్న మరో అధికారి కూడా డిప్యూటీ సెక్రటరీ (అకడమిక్) పదవికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతు న్నాయని సమాచారం. ఇందుకోసం ఆమెకు అర్హత వచ్చే విధంగా కొత్త నిబంధనలు రూపొందించి, వాటిని బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ద్వారా రేటిఫికేషన్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రిన్సిపాల్స్ యూనియన్ ఇప్పటికే సంస్థ కార్యదర్శికి లీగల్ నోటీసులు కూడా ఇచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ, ఇప్పటికే ప్రమోషన్ పొందిన అధికారి తన గత ప్రమోషన్‌పై ప్రశ్నలు రాకుండా ఉండేందుకు, కొత్త ప్రమోషన్‌ను కూడా అదే విధంగా అమలు చేయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు పలువురు అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.అకడమిక్ వ్యవస్థతో సంబంధం లేని అధికారులను అకడమిక్ కీలక పదవుల్లో నియమిస్తే గురుకులాల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే భయం వ్యక్తమవుతోంది. అకడమిక్ పరిపాలన అనేది కేవలం పరిపాలనా బాధ్యత మాత్రమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యంత కీలక వ్యవస్థ. పోటీ ప్రపంచంలో విద్యార్థులను ఐఐటీ, నీట్, సివిల్స్, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలంటే అకడమిక్ అనుభవం కలిగిన అధికారులు అవసరం. కానీ అకడమిక్ అనుభవం లేని నాన్-అకడమిక్ అధికారులను అకడమిక్ పోస్టుల్లో నియమిస్తే విద్యా ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రత్యేకంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుతున్న గురుకులాల్లో అకడమిక్ నాణ్యత తగ్గిపోతే, ఒక తరం మొత్తం విద్యాపరంగా నష్టపోయే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకడమిక్ పోస్టులు అకడమిక్ అనుభవం కలిగిన అర్హులకే ఇవ్వాలనీ, ప్రమోషన్లు పూర్తిగా రూల్స్ ప్రకారమే జరగాలనీ, లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు తీవ్రమైన సంక్షోభంలో పడుతుందని పలు వర్గాలు సూచిస్తున్నాయి. నిబంధనల మేరకు పదోన్నతులు కల్పించాలి : టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ సోషల్ వెల్ఫేర్ గురుకులాల సొసైటీలో నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలి. ముఖ్యంగా జోనల్ ఆఫీసర్, డిప్యూటీ సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీ పోస్టుల పదోన్నతుల విషయంలో సొసైటీలో ఉన్న కొందరు అధికారులు తమ స్వార్థం కోసం నిబంధనావళికి భిన్నంగా ప్రమోషన్ తీసుకునే ప్రయత్నం, అనగా అకడమిక్ విభాగం కోటాలో ప్రిన్సిపాళ్లకు దక్కాల్సిన పదోన్నతులు వారికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయమై గిరిజిన సంక్షేమం స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి ప్రాతినిథ్యం చేశాం.
అకడమిక్ పోస్టుల్లో నాన్-అకడమిక్ అధికారుల నియామకాలపై వివాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



