వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు సువర్ణావకాశం
సాయంత్రం బీటెక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల..రాష్ట్రవ్యాప్తంగా 12 కళాశాలల్లో 1,050 సీట్లు
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
ఉద్యోగం చేస్తూనే ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేయాలనుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు అరుదైన అవకాశం లభించింది. డిప్లొమా పూర్తి చేసిన ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగుల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘బీఈ/బీటెక్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్’ కోర్సుల ప్రవేశాల కోసం టీజీ ఈసెట్-2026 (డబ్ల్యూపీ) నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసింది.
2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు అప్పగించారు. ఈ మేరకు కన్వీనర్‌గా యూసీఈ(ఏ) ప్రిన్సిపాల్ ప్రొ. పైడిమర్రి చంద్రశేఖర్ వ్యవహరిస్తున్నారు. ఎఐసీటీఈ రెగ్యులర్ ప్రోగ్రాం ఉండి దానిలో 3వ వంతు ఇన్ టెక్ కు ఏఐసీటీఈ అనుమతిచ్చింది.
అర్హతలు
అభ్యర్థులు డిప్లొమా ఉత్తీర్ణులై ఉండటంతోపాటు కనీసం సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి. ఉద్యోగ స్థలం లేదా నివాసం సంబంధిత కళాశాలకు 75 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. వయోపరిమితి లేదు. ఎఐసీటీఈ నిబంధనల ప్రకారం కోర్సు పూర్తి చేయడానికి 120 క్రెడిట్లు సాధించాల్సి ఉంటుంది.
12 కళాశాలల్లో 1,050 సీట్లు
రాష్ట్రంలో 12 కళాశాలకు ఈ కోర్సుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 12 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆరు విభాగాల్లో మొత్తం 1,050 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోనే 150 సీట్లు కేటాయించారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, మెటలర్జీ విభాగాల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
పరీక్ష విధానం
ప్రవేశ పరీక్ష ఓఎంఆర్ విధానంలో నిర్వహించనున్నారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో 90 మార్కులు సంబంధిత సబ్జెక్టుకు, 10 మార్కులు గణితానికి కేటాయించారు. పరీక్ష సమయం రెండు గంటలు.
కీలక తేదీలు
దరఖాస్తుల చివరి తేదీ : జులై 18
హాల్ టికెట్ల డౌన్‌లోడ్ : జులై 28
ప్రవేశ పరీక్ష : ఆగస్టు 1, 2
ఫలితాల విడుదల : ఆగస్టు 8
కౌన్సెలింగ్ : ఆగస్టు మూడో వారం
తరగతుల ప్రారంభం : సెప్టెంబర్ మొదటి వారం
వారాంతాలు, సాయంత్రం తరగతులు
శనివారం, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. టీఎఫ్ఆర్‌సీ నిబంధనల ప్రకారమే ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, దరఖాస్తుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ www.tgecetwp.inను అందుబాటులో ఉంచినట్టు కన్వీనర్ తెలిపారు.
వర్కింగ్ ప్రొపెషనల్స్ ఇది సువర్ణ అవకాశం కన్వీనర్ ప్రొ. పైడిమర్రి చంద్రశేఖర్
డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగాల్లో ఉన్నవారు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఈ కోర్సులు ఎంతో ఉపయోగప డతాయి. ప్రస్తుతం పనిచేస్తున్న రంగాల్లో ప్రమోషన్స్ పొందటానికి ఈ బీటెక్ దోహదపడుతుంది. అడ్వాన్స్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ అవగాహన పొందుతారు. వృత్తిపరంగా పురోగతి సాధించడంతో పాటు భవిష్యత్‌లో పీజీ, పీహెచ్‌డీ చదివే అవకాశాలు కూడా లభిస్తాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాలను కొనసాగిస్తూనే ఇంజినీరింగ్ డిగ్రీ సాధించేందుకు ఇది సువర్ణావకాశం. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఓయూ చేపడుతోంది. అందుకు ఓయూ వీసీ ప్రొ. కుమార్ చొరవ కృషి ఉంది. ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఉన్నత విద్యామండలికి, ఓయూ వీసీకి కృతజ్ఞతలు.



