కాటన్‌ మిల్లులు కనుమరుగు

– ఉమ్మడి జిల్లాలో అమ్మకానికి 8
– రోడ్డున పడుతున్న వేలాది మంది కార్మికులు
– చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం కరువు
– కేంద్ర ప్రభుత్వ సాయం అందక ఇబ్బందుల్లో యాజమాన్యాలు
– జిల్లాలో కుంటుపడిన పారిశ్రామిక అభివృద్ధి
నవతలంగాణ -మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
నవతలంగాణ -మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

 మాకు బతుకు తెరువు లేకుండా పోయింది
మేము పదేండ్లుగా కాటన్‌ మిల్లులో పనిచేస్తున్నాం. బీహార్‌ నుంచి వచ్చిన మాకు మిల్లులే ఉపాధి చూపిం చాయి. ఇప్పుడు కాటన్‌ మిల్లులో పత్తి లేకపోవడం వల్ల మాకు పని లేకుండా పోయింది.
– లక్ష్మణ్‌, కాటన్‌ మిల్లు కూలీ
పావలా వడ్డీ అవకాశం కల్పించాలి
      రైతులతో అనుబంధంగా ఉండే కాటన్‌ మిల్లులను ప్రభుత్వం ఆదుకోవాలి. ముఖ్యంగా కార్పొరేట్‌ కంపెనీల మాదిరిగా యాజమాన్యాలకు సబ్సిడీలు అందజే యాలి. విద్యుత్‌ బకాయిలను మాఫీ చేయడం ద్వారా కాటన్‌ మిల్లులను నిలబెట్టాలి. గ్రామపంచాయతీ టాక్స్‌తో పాటు ప్రభుత్వ పన్నులను నిలిపేయాలి.
– రవికుమార్‌, కాటన్‌ మిల్‌ యజమాని ఇంద్రకల్‌
మూసివేత బాటలో పరిశమ్రలు
      జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పాతాళానికి పడి పోతున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిలలలో ప్రధానమైన కాటన్‌ పరిశ్రమలు వరుసగా మూత పడుతున్నా.. ప్రభుత్వానికిగానీ, అధికారులకుగానీ చీమకుట్టినట్టు అయినా లేదు. వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. బడా కార్పొరేట్ల కోసం పరితపిస్తున్న ప్రభుత్వాలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల గురించి పట్టించుకోని దుస్థితి నెలకొంది.
      ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 50కి పైగా కాటన్‌ మిల్లులు జిన్నింగ్‌ మిల్లులు, సుమారు 30 విత్తన కంపెనీలు నడుస్తున్నాయి. ఈ 80 మిల్లులకు గాను ఇప్పటికే సగం మూతబడ్డాయి. నాగర్‌ కర్నూల్‌లో రెండు, కల్వకుర్తిలో ఐదు, అచ్చంపేటలో ఒక జిన్నింగ్‌ మిల్లు మూతపడే దశకు వచ్చాయి. ఇప్పటికే 10 జిన్నింగ్‌ మిల్లులకు పైగా అమ్మకానికి పెట్టేందుకు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.
      చేనేత జిల్లా అయిన గద్వాల జిల్లాలో జిన్నింగ్‌ మిల్లులు అత్యధికంగా ఉన్నాయి. వాటి ద్వారా ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తోంది. దాంతో ఇక్కడ వ్యాపారాలు బాగా విస్తరించాయి. విత్తన పత్తితోపాటు దూది పత్తి ఈ ప్రాంతంలో దిగుబడి బాగా వస్తుండటంతో ఇక్కడి కాటన్‌ పరిశ్రమలు గతంలో లాభాలతో కొనసాగేవి. రోజుకు రెండు షిఫ్టుల్లో కూలీలు పనిచేసేవారు. కానీ నేడు పత్తి దిగుబడి తగ్గడంతో మిల్లులు నడవక కూలీలు వీధిన పడ్డారు. వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 17 జిమ్మింగ్‌ బిల్లులు ఉన్నాయి. వర్షాలు అనుకూలంగా వచ్చి సరైన దిగబడి వస్తే సెప్టెంబర్‌ వరకు మిల్లులు నడవాలి. ఈసారి జనవరి నాటికే మిల్లులు ఆగిపోయాయి. ఇంద్రకల్‌ దగ్గర ఉన్న జగదాంబ కాటన్‌ మిల్‌లో పత్తి లేక ధాన్యాన్ని నిల్వ చేశారు. 70 వేల బెల్ల దిగుబడి రావాల్సి ఉండగా ఈసారి కేవలం 6000 బేల్లు మాత్రమే వచ్చాయి. పత్తి సాగు పెరిగినా దిగుబడి తగ్గడంతో అటు రైతులు ఇటు కాటన్‌ మిల్లుల యాజమాన్యాలు నష్టపోతున్నారు.
      ఈ మిల్లులో ఏటా 150 మంది కార్మికులు ఉండాల్సి ఉండగా 8 మంది మాత్రమే పని చేస్తున్నారు. మిగతా వారంతా హైదరాబాద్‌లో అడ్డా కూలీలుగా మారారని తెలుస్తోంది. వనపర్తి కాటన్‌ మిల్లుల పరిస్థితి ఇదే. ప్రభుత్వం ఆదుకోకపోతే పరిశ్రమలన్నీ మూతబడి ఉపాధి లేకుండా పోతుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకనే మూత
      కార్పొరేట్‌ బడా పారిశ్రామికవేత్తలకు మడుగు లొత్తుతున్న ప్రభుత్వాలు చిన్న, మధ్యతరహా పరిశ్రమల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. కరోనా ప్రభావం చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై తీవ్రంగా పడటంతో యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిశ్రమలను కాపాడేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. వరుసగా పరిశ్రమలన్నీ మూతపడటంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ సహకరిస్తుందని, స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టడం తప్ప ఆచరణలో మాత్రం పట్టించుకోని పరిస్థితి. దాంతో ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికైనా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు మూతపడిన పరిశ్రమలన్నింటినీ తెరిపించాలని పలువురు కోరారు.

Spread the love