ఇండ్ల స్థలాల సాధనకై సిపిఎం చలో కలెక్టరేట్ విజయవంతం

నవతెలంగాణ – కంటేశ్వర్
సిపిఎం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ఇళ్ల స్థలాలు పోరాటం లో పాల్గొన్న ప్రజలు దుబ్బ ప్రాంతంలోని భూ పోరాట కేంద్రం నుండి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి, ఇళ్ల స్థలాలు కావాలని నినాదాలతో కలెక్టరేట్ను హోరెత్తించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్యాల గోవర్ధన్ ప్రభుత్వానికి ప్రజలు పెట్టిన దరఖాస్తులను నెత్తిన మోస్తూ, కలెక్టర్ చాంబర్ కి తీసుకువెళ్లి జేసీ చంద్రశేఖర్ కి వందలాది దరఖాస్తులు, వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది, జెసి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అక్కడ ప్రభుత్వ భూమినీ తప్పకుండా సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు , గుర్తించిన భూమిని పేద ప్రజలకు పంపిణీ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి అడవల రమేష్ బాబు మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ శివారులో సర్వేనెంబర్ 171,172 లలో ఉన్న ప్రభుత్వ భూమిలో గత పది, పదిహేను రోజులుగా భగభగ మండే ఎండలో, నిన్న కురిసిన వర్షంలో సైతం చంటి బిడ్డలను ఎత్తుకొని ఎండకు ఎండుతూ, వానకు నానుతూ ఇళ్ల స్థలాల కోసం పోరాటాలను చేస్తున్నారని అన్నారు, మరోవైపు ప్రభుత్వ భూమిని అక్రమంగా కాజేసే పద్ధతుల్లో వ్యవహరిస్తున్న భూ బకాసురులకు అండగా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం వ్యవహరించడం సరికాదని అన్నారు, ప్రజల పక్షాన నిలవాల్సిన అధికారులు వారికి కొమ్ము కాయటం ఏందని ప్రశ్నించారు! ప్రజా ఉద్యమాల ద్వారానే ఇళ్ల స్థలాలను సాధిస్తామని అన్నారు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ 171 సర్వే నెంబర్ లో 13 ఎకరాల 30 గుంటల అసైన్మెంట్ భూమి ఉందని అందులో 8 ఎకరాల ఐదు గుంటల భూమిని పంచాయతీరాజ్ టీచర్లకు కేటాయించారని, మిగిలిన 5 ఎకరాల 30 గుంటల భూమిని భూ కబ్జాదారులు కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు, అదే స్థలంలో నిరుపేదలు గుడిసెలు వేస్తే మాత్రం తొలగించాలని భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు, అధికారులు భూ బకాసురులను నిలువరించి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు, కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళన కు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకటరాములు, మద్దతు ప్రకటిస్తూ మాట్లాడారు, ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి పెద్ది సూరి, జిల్లా కమిటీ సభ్యురాలు బెజగం సుజాత, నగర కమిటీ సభ్యులు ధ్యారంగుల కృష్ణ, షేక్ అబ్దుల్, కటారి రాములు, నల్వాల నరసయ్య, బొప్పిడి అనసూజ, మహేష్, లావణ్య,కళావతి, భూపోరాటం నాయకులు శ్రీధర్, ఇమామ్, రాము, నితీమ, లింబాద్రి, రహమత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love