బూతులు, అసహజ అశ్లీల దృశ్యాలతో రూపొందిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌పై వచ్చిన విమర్శల వెల్లువకి తట్టుకోలేక తెలుగు వర్షెన్ సిరీస్‌ని నెట్‌ఫ్లిక్స్ తొలగించింది. దీంతో విమర్శలు గెలిచాయంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతోపాటు వెంకటేష్ అభిమానులు సైతం ప్రశంసలు కురిపించారు.
వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది. శ్రుతిమించిన బూతులున్నాయంటూ ఈ వెబ్ సిరీస్‌పై విడుదలైన మొదటి రోజు నుంచే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దర్శకులకు స్వేచ్ఛనిచ్చింది సృజనాత్మకంగా సినిమాలు తెరకెక్కించడం కోసమే కానీ అశ్లీలాన్ని వ్యాపింపచేయడం కోసం కాదని, ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవల కేంద్ర సమాచార మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. ఆయన స్పందించిన రోజుల వ్యవధిలోనే నెట్‌ఫ్లిక్స్ నుంచి ‘రానా నాయుడు’ని తీసెయ్యడంతో ఇకపై ఇలాంటి బూతు, అశ్లీలం, మహిళలను కించపరిచే సిరీస్‌లను రిలీజ్ చేయాలనుకున్న వారికి కూడా గట్టి హెచ్చరిక అయ్యింది.