గురునానక్‌ కళాశాల గుర్తింపును రద్దుచేయాలి

– ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి. శంకర్‌
– ఇబ్రహీంపట్నంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో
– ఆందోళన కారులను అరెస్టు చేసిన పోలీసులు
నతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న గురునానక్‌ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.శంకర్‌ డిమాండ్‌ చేశారు. గురునానక్‌ కళాశాల గుర్తిపును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం సాగర్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రాస్తారోకో చేస్తున్న నాయకులను అరెస్టు చేయడంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రాస్తారోకో చేయడంతో కిలోమీటర్‌ పొడవునా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ పేరుతో గురునానక్‌ కళాశాల యాజమన్యం విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. మొత్తం నాలుగు వేల మంది విద్యార్థుల వద్ద ఒక్కో విద్యార్థి నుంచి రూ. 3లక్షల వరకు డొనేషన్లు తీసుకొని సుమారు రూ.100 కోట్లు వసూలు చేశారన్నారు. ఇప్పటి వరకు ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేదన్నారు. గురునానక్‌ యాజమాన్యంపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గురునానక్‌ కాలేజీలో చదివితే తమ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఆశించిన తల్లిదండ్రులు ఎంత కష్టమైనా డబ్బులు కట్టిన అడ్మిషన్‌ పొందారన్నారు. నేడు వారికి విద్యా సంవత్సరం వృధా అవుతుండటంతో ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా గురునానక్‌లో చదువుతున్న విద్యార్థులను జేఎన్టీయూహెచ్‌కి అటాచ్‌ చేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గురునానక్‌ కాలేజ్‌ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రణరు, ఉపాధ్యక్షులు మస్కు చరణ్‌, సహాయ కార్యదర్శి సిద్దు, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్ష, కార్యదర్శులు తరంగ్‌, మద్దెల శ్రీకాంత్‌, జిల్లా కమిటీ సభ్యులు విప్లవ కుమార్‌, సుమంత్‌, కురుమిద్ద శివ, నాయకులు వంశీ, వినోద్‌, వినరు, వర్షిత్‌, సంపత్‌, లక్ష్మణ్‌ తదరులు పాల్గొన్నారు.

Spread the love