దేశంలో మౌలిక విలువల విధ్వంసం ఇదే పాలన కొనసాగితే సంక్షోభం

–  ఒక్క వేటుతో ప్రజాస్వామ్యాన్ని చంపలేరు..
– స్కిల్‌, మేకిన్‌ ఇండియాల ప్రస్తావన ఇప్పుడేది?
– మనకేంటి? అనే భావన నుంచి బయటపడాలి
– ‘కేంద్ర ప్రభుత్వ విధ్వంసకర విధానాలు- విషాద పరిణామాలు’పై సదస్సులో
‘ద క్రూకుడ్‌ టింబర్‌ ఆఫ్‌ న్యూ ఇండియా’ పుస్తక రచయిత పరకాల ప్రభాకర్‌
నవతెలంగాణ –
ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో మౌలిక విలువలకు విరుద్ధ పాలన కొనసాగుతుందని, ఇలాంటి పాలన చేసే వారికి పాలించే హక్కు లేదని, ఇదే కొనసాగితే దేశం సంక్షోభంలో కూరుకుపోతుందని ‘ద క్రూకుడ్‌ టింబర్‌ ఆఫ్‌ న్యూ ఇండియా’ (నవీన భారతపు వంకర కలప) పుస్తక రచయిత పరకాల ప్రభాకర్‌ తెలిపారు. ప్రత్యామ్నాయ పౌర సమూహం (సీసీఏ) ఆధ్వర్యంలో ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన ‘కేంద్ర ప్రభుత్వ విధ్వంసకర విధానాలు- విషాద పరిణామాలు’పై సదస్సులో ఆయన మాట్లాడారు. ఐదారేండ్లుగా దేశంలో పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ఆ భయంతోనే ‘ద క్రూకుడ్‌ టింబర్‌ ఆఫ్‌ న్యూ ఇండియా’ పుస్తకాన్ని రాశానని తెలిపారు. మణిపూర్‌ మండిపోతుందని, గంగానదిలో శవాలు తేలాయన్నా.. పాలకులకు చీమకుట్టినట్టు లేదని విమర్శించారు. ఆస్పత్రులు, ఆక్సిజన్‌, పడకలు లేక వందలాది మంది చనిపోతున్నా.. దేశంలో ఎక్కడో ఏదో జరుగుతుందంటే మనకెందుకులే అనుకుంటే దేశం సంక్షోభంలో కూరుకుపోతుందని హెచ్చరించారు. బ్రిటిష్‌ ఎకానమీని సైతం అధిగమించి ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దేశం ఐదో స్థానంలో ఉందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2019 నుంచి కిందపడుతూ ఉన్న ఆర్థిక వ్యవస్థ ఎలా మరో దేశాన్ని అధిగమిస్తుందని ప్రశ్నించారు. ప్రపంచంలోనే 17-24 సంవత్సరాల యువత ఎక్కువగా దేశం మనదని, అటువంటి యువతలో శిక్షణ, నేర్పరితనం లేకుండా నూటికి 24శాతం మంది నిరుద్యోగంలో మగ్గుతున్నారని తెలిపారు. పౌష్ఠికాహారం లేకుండా మలమల మాడుతున్న వారు ప్రపంచంలో 27శాతం మనదేశంలోనే ఉన్నారని చెప్పారు. వ్యవసాయం వదలలేని వారి సంఖ్య, ఉపాధిహామీ చట్టం కింద జాబ్‌కార్డులకు దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య ఎక్కువవుతుందన్నారు. 2015లో 102 ఉన్న బిలియనీర్ల సంఖ్య ఇప్పుడు 145కు పెరిగిందని, 84శాతం వ్యవసాయదారుల ఆదాయం క్రమేణా తగ్గుతుందని విశ్లేషించారు. అయినా ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇలానే చూస్తూ ఉంటే మణిపూర్‌ విధ్వంస జ్వాలలు దేశంలోని మిగతా రాష్ట్రాలకూ పాకవచ్చని హెచ్చరించారు. ఒకటి రెండు సీట్లు, పదవుల కోసం రాజకీయ బేరసారాలకు పార్టీలు దిగజారుతున్నాయని తప్పుబట్టారు. తాము లౌకికవాదులమన్న శక్తులు ఇప్పుడు దానిగురించే ఉచ్ఛరించడం లేదన్నారు. కేంద్ర మంత్రి మండలిలో ఒక్క ముస్లిం కూడా లేడని, లోక్‌సభ, రాజ్యసభ పార్లమెంటరీ పార్టీలోనూ ఒక్క ముస్లిం లేడని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో 21శాతం మంది ముస్లింలుంటే బీజేపీ ఒక్క ముస్లింకు కూడా టిక్కెట్‌ ఇవ్వలేదన్నారు. గుజరాత్‌లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. తిరస్కార్‌- పురస్కార్‌- పరిష్కార్‌- సంస్కార్‌ పద్ధతులను బీజేపీ ముస్లింల విషయంలో అనుసరిస్తోందన్నారు. స్కిల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, గుజరాత్‌ మోడల్‌ లాంటి విషయాల గురించి ఇప్పుటి బీజేపీ నాయకులు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ‘బేటి బచావ్‌ – బేటీ పడావ్‌’ నిధుల్లో 75శాతం ప్రకటనలకే పోయాయంటే ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థమవుతుందన్నారు. విధ్వంసక విధానాలతో పాలిస్తున్న బీజేపీ కర్నాటకలో ఓడిపోలేదని, క్రితం ఎన్నికల్లో వచ్చినట్టుగానే ఈసారి కూడా ఆ పార్టీకి 36శాతం ఓట్లు లభించాయంటే.. లోతుగా వెళ్లిన ఈ జాఢ్యం ఎన్నికలతో పోయేది కాదని గ్రహించాల్సిందిగా హెచ్చరించారు. డాక్టర్‌ యలమంచిలి నాగమణి సభికులకు ఆహ్వానం పలుకగా ఐవీ రమణ సభా నిర్వహణ బాధ్యతలు చూశారు. దేవిరెడ్డి విజరు వందన సమర్పణ గావించారు. ఈ సదస్సులో డాక్టర్లు యలమంచిలి రవీంద్రనాథ్‌, గోపీనాథ్‌, రవిమారుత్‌, స్పర్శ భాస్కర్‌, మువ్వా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love