Friday, June 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండిజిట‌ల్ విప్ల‌వం

డిజిట‌ల్ విప్ల‌వం

- Advertisement -

టైర్-2 నగరాలే తదుపరి డేటా హబ్‌లకు కేంద్రాలు
గ్లో‌బ‌ల్ టెక్‌హ‌బ్‌గా పేరొందిన తెలంగాణ‌
భ‌విష్య‌త్‌లో వరంగల్, కరీంనగర్‌కు అద్భుత అవకాశం
అమెజాన్ వెబ్ సర్వీసెస్ మేనేజర్ సాయితేజ కమాని పీహెచ్‌డీ పరిశోధనలో ఆసక్తికర అంశాలు

నవతెలంగాణ – క‌రీంన‌గ‌ర్ ప్రాంతీయ ప్ర‌‌తినిధి
డిజిట‌ల్ ఆర్థి‌క వ్య‌వ‌స్థ‌లో దేశం అత్యంత వేగంగా దూసుకుపోతోంది. యూపీఐ డిజిటల్ చెల్లింపుల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, ఆన్‌లైన్ విద్య వరకు ప్రతి రంగంలోనూ డేటా వినియోగం నూతన గరిష్టాలను తాకుతోంది. అయితే, దేశ భవిష్యత్‌ను శాసించే ఈ భారీ డిజిటల్ నెట్‌వర్క్‌కు వెన్నుముక లాంటి ‘డేటా సెంటర్ల్ణ మౌలిక సదుపాయాలు ప్రస్తుతం కేవలం ఐదు మెట్రో నగరాల (ముంబయి, చె‌న్నయ్‌, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ)‌కే పరిమితమై ఉన్నాయి. ఈ కేంద్రీకృత విధానం దేశ డిజిటల్ భద్రతకు పెను ముప్పని, డిజిటల్ వృద్ధిని వికేంద్రీకరించి టైర్-2 నగరాలకు విస్తరించాల్సిన సమయం ఆసన్నమైందని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడ‌బ్ల్యూఎస్‌) ప్రొక్యూర్‌మెంట్ ఆపరేషన్స్ మేనేజర్ సాయితేజ కమాని తన పీహెచ్‌డీ పరిశోధనాత్మక విశ్లేషణలో స్పష్టం చేశారు. ‘మెట్రో్ణల గడప దాటి డేటా సెంటర్లు విస్తరిస్తేనే దేశానికి తిరుగులేని డిజిటల్ రక్షణ లభిస్తుందని, ద్వితీయ శ్రేణి నగరాల ఆర్థిక రూపురేఖలు మారిపోతాయని ఆయన అన్నారు.

ఐదు నగరాల చేతుల్లోనే డేటా
ప్రస్తుతం దేశంలోని డేటా సెంటర్ రంగం ముంబయి, చెన్నయ్‌, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ నగరాల చుట్టూనే కేంద్రీకృతమై ఉంది. సాంకేతిక హబ్‌లుగా ఈ నగరాల పాత్ర అమోఘమైనదే అయినప్పటికీ, కేవలం వీటిపైనే పూర్తి దేశ డిజిటల్ భవిష్యత్‌ను పణంగా పెట్టలేమని సాయితేజ కమాని హెచ్చరిస్తున్నారు. భౌతిక ఆర్థిక వ్యవస్థ వృద్ధి కోసం మనం గతంలో పూణే, సూరత్, కోయంబత్తూరు, విశాఖపట్నం వంటి నగరాల్లో హైవేలు, పారిశ్రామిక కారిడార్లు నిర్మించి ఎలాగైతే సంపదను సృష్టించాయో… డిజిటల్ రంగంలోనూ అదే ఃవికేంద్రీకరణ తర్కాన్నిః అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు.

టైర్-2 న‌గ‌రాల్లో ఖ‌ర్చు త‌క్కు‌వ‌
మెట్రో నగరాలతో పోలిస్తే టైర్-2, సెమీ-అర్బన్ ప్రాంతాలలో భూమి లభ్యత సులభం, ధరలు కూడా చాలా తక్కువ కావ‌డంతో నిర్వ‌హ‌ణ వ్య‌యం త‌గ్గు‌తుంది. మెట్రో నగరాల్లో విద్యుత్ గ్రిడ్‌లపై అపారమైన ఒత్తిడి ఉంటోంది. టైర్-2 నగరాల్లో గ్రిడ్ పరిమితులు లేకపోవడం వల్ల డేటా సెంటర్లకు అవసరమైన నిరంతర విద్యుత్‌ను సులభంగా విస్తరించి గ్రిడ్‌ ఒత్తి‌డికి చెక్ పెట్టొచ్చు. ప్రతి ఏటా టైర్-2 నగరాల నుంచి వస్తున్న వేలాది మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల కోసం మెట్రోలకు వలస వెళ్లాల్సిన పనిలేకుండా, స్థానికంగానే ఎలక్ట్రికల్, మెకానికల్, లాజిస్టిక్స్, ఆపరేషన్స్ రంగాలలో ఉన్నత ఉద్యోగాలు సాధించొచ్చు. సాయితేజ కమాని తన పరిశోధనలో అత్యంత కీలకమైన మరో అంశాన్ని లేవనెత్తారు. కేవలం ఐదు నగరాల్లోనే డేటా సెంటర్లను ఉంచడం వల్ల వ్యవస్థాగత ప్రమాదాలు (సిస్ట‌మెటిక్ రిక్స్‌)పొంచి ఉన్నాయి. ఇటీవల మనం చూసిన పట్టణ వరదలు, తీవ్ర వాతావరణ మార్పులు, విద్యుత్ అంతరాయాలు వంటివి సంభవించినప్పుడు దేశం మొత్తం డిజిటల్ పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే, దేశ డిజిటల్ భద్రత, స్థితిస్థాపకతను కాపాడుకోవడానికి డేటా సామర్థ్యాన్ని భౌగోళికంగా వికేంద్రీకరించడం ఆర్థికంగానే కాకుండా, జాతీయ రక్షణ పరంగానూ అత్యవసరమని ఆయన వివరించారు.

రేసులో వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ న‌గ‌రాలు
డిజిటల్ వికేంద్రీకరణ విప్లవాన్ని నడిపించడం లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందని సాయితేజ కమాని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చిన అనుభవం తెలంగాణకు ఉంది. ఇప్పుడు అదే వ్యూహంతో వరంగల్, కరీంనగర్ వంటి నగరాలను డిజిటల్ కారిడార్లుగా మార్చవచ్చని ఆయన సూచించారు. ఈ ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా నిర్మాణ రంగం, లోకల్ ప్రొక్యూ‌ర్‌మెంట్‌, నిరంతర కార్యకలాపాల వల్ల డౌన్‌స్ట్రీమ్ ఆర్థిక వ్యవస్థ
ఊపందుకుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -