Friday, June 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యాశాఖలో రూ.2 వేల కోట్ల కుంభకోణం

విద్యాశాఖలో రూ.2 వేల కోట్ల కుంభకోణం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యాశాఖలో గుజరాత్‌ ‌కాంట్రాక్టర్ల పేరుతో రూ.రెండు వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే బడుల ప్రారంభాన్ని ఈనెల 12కు బదులుగా 15వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసిందన్నారు. గురువారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌‌రావు మాట్లాడుతూ ఏటా జూన్ 12న తెరుచుకోవాల్సిన స్కూళ్లను 15వ తేదీకి ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. దీని వెనుక ఏకంగా రూ. రెండు వేల కోట్ల భారీ కుంభకోణం దాగి ఉందని చెప్పారు. కమీషన్ల కోసం కాంట్రాక్టులు సెట్ కాకపోవడం వల్లే బడుల ప్రారంభాన్ని ప్రభుత్వం వాయిదా వేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలు, ప్రభుత్వ బడుల్లో యూనిఫారాలను కుట్టే బాధ్యత చేనేత కార్మికులకు, షూ, బెల్టుల తయారీని దళిత కుటుంబాలు బతకాలని లిడ్‌ ‌క్యాప్‌‌కు ఇచ్చామని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వాటిని కేంద్రీకృతం చేసి, తెలంగాణ వాళ్ల పొట్టగొట్టి గుజరాత్ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారని అన్నారు. ఆ కాంట్రాక్టర్ నుంచి ఇంతవరకు బట్టలు రాలేదనీ. ఏడు లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఇవ్వాల్సిన బ్యాగులు, యూనిఫారాలు, బెల్టులు, నోట్ పుస్తకాలు ఏవీ ఇంకా అందలేదని చెప్పారు.

విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఉండటం వల్లే విద్యావ్యవస్థ ఇంత అస్తవ్యస్తంగా మారిందన్నారు. సీఎం కనుసన్నల్లో గత టెండర్ల కంటే ఇప్పుడు రేట్లు డబుల్ చేసి మరీ టెండర్లు ఖరారు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. చివరకు విద్యార్థులు తినే కోడిగుడ్డులో కూడా అవినీతి చేయడం దారుణమని అన్నారు. పేద పిల్లలు చదివే గురుకులాల్లో ఇలా కమీషన్లు కొడితే సమాజం క్షమించదని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య దారుణంగా తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వమే నివేదిక ఇస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి యూకేజీ అని రకరకాల కట్టుకథలు చెప్తున్నారని వివరించారు. ప్రభుత్వ బడుల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అసలు అమలే కావడం లేదన్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పనులు చేసిన మహిళా సంఘాలకు, పేదలకు ఒక్కో నియోజకవర్గానికి రూ.నాలుగు కోట్ల చొప్పున బిల్లులు పెండింగ్ పెట్టారని చెప్పారు. బడుల్లో పనిచేసే స్కావెంజర్లకు సైతం నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదని చెప్పారు. అప్పులు తేవడానికి ఈ ప్రభుత్వం దళారులను పెట్టుకున్నదని అన్నారు. రూ.వందల కోట్ల కమీషన్లతో ముంబయికి చెందిన బ్రోకర్ విమానం కొనుక్కున్నారని వివరించారు. సచివాలయానికి వెళ్లని సీఎం రేవంత్‌‌రెడ్డి కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌‌ను క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారని అన్నారు.

ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో మరో క్యాంపు కార్యాలయం కట్టుకుంటున్నారని వివరించారు. జూబ్లీహిల్స్‌‌లో ఆయన నివాసానికి కొద్ది దూరంలోనే ఏకంగా రూ.వంద కోట్లతో బోధి పెవిలియన్ పేరుతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారని విమర్శించారు. అర్ధరాత్రి పూట సతీసమేతంగా వెళ్లి అక్కడి పనులను, కుటుంబ సభ్యులతో సోఫాలను స్వయంగా పర్యవేక్షించారని అన్నారు. మొదట రూ.ఏడు కోట్లతో జీవో ఇచ్చి, ఇప్పుడు దాన్ని రూ.వంద కోట్లకు పెంచారని చెప్పారు. సీఎం విలాసాలకు క్యాంపు కార్యాలయాలు కడుతుంటే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మంలో మూడో క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారని వివరించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి, రైతులకు సాయం చేయడానికి ఖజానాలో డబ్బులు లేవంటున్న ప్రభుత్వానికి రూ.వందల కోట్లతో గెస్ట్ హౌస్‌లు కట్టుకోవడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి, ఉద్యోగుల జీతాలకు, రైతులకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవన్నారు. నెలకు రూ.రెండు కోట్ల అద్దెతో తిరిగిన హెలికాప్టర్ స్థానంలో, ఇప్పుడు నెలకు ఏకంగా రూ.

ఐదు కోట్లు వెచ్చించి మరీ కొత్త హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి షికార్లు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చా‌ర్జీ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడి వెన్నుపోటు కుట్ర దాగి ఉందన్నారు. ఆమె కేసు గురించి లీకులు ఇచ్చింది ఎవరో సిట్‌ ‌వేస్తారా లేదా ఏ విచారణ ద్వారానైనా తేల్చాలని డిమాండ్‌ ‌చేశారు. ఆర్టీఏ, రిజిస్ట్రేషన్, పెట్రోల్ ఛార్జీల పెంపుతో ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తున్నదని విమర్శించారు. అడ్డగోలుగా భూముల ధరలను పెంచడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంపాక్ట్‌ ఫీజులు, టోల్ గేట్ల పేరుతో ప్రజల జేబులకు మరో భారీ గండి పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ రద్దుతో పెట్టుబడులు, ఉద్యోగాలు ఏపీకి తరలిపోయేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు ఖాయమని పునరుద్ఘాటించారు. జర్నలిస్టులకు ఎలాంటి వివాదాలు లేని భూములు ఇవ్వకుండా కేసులు నడుస్తున్న ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఇస్తామనడం వారిని వంచించడమేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 111 జీవోను ఎత్తేసిందని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల కాంగ్రెస్ అనుయాయులు భారీగా భూములు కొనుక్కున్నారని అన్నారు. ఇప్పుడు వారికి మేలు చేసేందుకు ఔటర్ లోపల ఉన్న 111 జీవోను కూడా ఎత్తేసేలా సచివాలయంలో పెద్ద ఎత్తున ఫైళ్లు నడుపుతున్నారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు భూమి శిస్తు కూడా తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి అంటున్నారని అన్నారు. నిజంగానే బీఆర్‌ఎస్‌ ‘చెల్లని నోటు’ అయితే, ‌తమ గురించి సీఎం రేవంత్‌‌రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ క్ష‍ేత్రస్థాయిలో చాలా బలంగా ఉంది కాబట్టే ముఖ్యమంత్రికి నిద్రలో కూడా తామే గుర్తుకొస్తున్నామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -